‘సూపర్ క్రైమ్’కు అడ్డాగా మారుతున్న సారపాక
‘వలసలు – నేరజాడల’పై ఆందోళన…
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 24
ఓవైపు గంజాయి మత్తులో యువత ఆగడాలు… మరోవైపు గంజాయి అక్రమ రవాణాలో కీలకవ్యక్తుల కేరాఫ్ అడ్రస్… ఇంకొకవైపు అడ్డూఅదుపూ లేకుండా, పగలూ రాత్రీ తేడా లేకుండా సాగుతున్న ఇసుక, మట్టి, తదితర సహజ వనరుల దోపిడీ. వీటికితోడు భూఆక్రమణలు, సెటిల్మెంట్ల వంటి అక్రమదందాలకు తోడు తాజాగా సారపాకలోనే సాగిందంటున్న నకిలీ పట్టాదారుపాసుపుస్తకాల ప్రింటింగ్ దందా… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ కీలక పారిశ్రామిక ప్రాంతమైన సారపాక ‘సూపర్ క్రైమ్’ అడ్డాగా తయారయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా వలసప్రజలకు ఆవాసంగా, బతుకునిచ్చే నీడగా పేరొందిన సారపాక
పారిశ్రామిక ప్రాంతంలో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి జీవనోపాధి కోసం వచ్చి అనేకమంది స్థిరపడుతున్నారు. వివిధ రకాల సామాజిక నేపథ్యం నుంచి వచ్చే వారిలో ఇక్కడ కొంతకాలం స్థిరపడిన తర్వాత నేరాలవైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సారపాకలో నిత్యం ఏదో ఒక రకమైన అలజడి కనిపిస్తూనే ఉంటోంది.
############
అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాలను నిరోధించేవారేరీ…?
############
సమాజంలోని వారందరికీ ఒకే విధమైన నియమనిబంధనలు అమలు చేస్తేనే, ఏ ఒక్కరికీ అసంతృప్తి ఏర్పడదు. కొందరు పెత్తందారీతనంతో తామనుకున్నదేదైనా చేసుకుంటూ కోట్ల రూపాయలు పోగేసే పరిస్థితులుంటే వారితో పోటీపడేందుకు మిగిలినవారు తయారవుతుంటారనేది సహజమైన పరిణామం. ఈ పోటాపోటీ పరిస్థితులలో పెరిగిపోయే ఘర్షణ వైఖరి నేరాలకు కూడా దారితీస్తుంది. సారపాక ప్రాంతంలో ప్రతిరోజూ యధేచ్ఛగా సాగి పోతున్న ఇసుక, మట్టి అక్రమవ్యాపారం చూస్తున్న మరికొందరు గంజాయి వంటి వ్యాపారాలకూ తెగబడుతున్నారు. ఏం చేసైనా సరే డబ్బులు పోగేసుకోవాలన్న ఆరాటంలో ఒకరికొకరు పోటీలుపడుతూ అక్రమదందాలతో నేరాల వైపు పయనం సాగిస్తున్నారు. ఇసుక, మట్టి దందాలకు అవకాశం లేనివారు గంజాయి రవాణా, భూఆక్రమణలు, సెటిల్మెంట్లు, బెట్టింగుల వంటి వాటి బాటపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో గంజాయి రవాణాలో కీలకవ్యక్తులుగా ఈ ప్రాంత వ్యక్తులు కొందరు పోలీసులకు పట్టుబడిన సంఘటనలున్నాయి. అక్రమ సంపాదనకోసం అడ్డదారులు వెతుక్కునే ప్రయత్నంలో కొందరు రాష్ట్రంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన ‘నకిలీ పట్టాదారు పాసుపుస్తకాల దందా’కు సారపాకను అడ్డాగా మార్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కూసుమంచి పోలీసులు తమ దర్యాప్తులో పట్టుబడిన ముఠా ఆ నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు సారపాకలో ముద్రించినట్లు వెల్లడించడం పరిస్థితిని తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పెరుగుతున్న నేరాలకు, పరిస్థితులకు అడ్డుకట్ట వేసి, సగటు మనిషి జీవితం ప్రశాంతంగా సాగిపోయే వాతావరణం కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపైన ఉందని పలువురు సామాజికవేత్తలు సూచిస్తున్నారు.

