ప్రతి కేసులో సమగ్రంగా దర్యాప్తు చేయాలి

డయల్ 100కు ఫోన్ రాగానే స్పందించి బాధితులకు అండనివ్వాలి
నేరసమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 15)
ప్రతి కేసులో సమగ్రమైన దర్యాప్తు చేసి,
నేరస్తులకు శిక్షపడే విధంగా అధికారులు కృషిచేయాలని, డయల్ 100కు ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి బాధితులకు అండనివ్వాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లాలోని అధికారులతో నిర్వహించిన నెలవారీ నేరసమీక్ష సమావేశంలో ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రతీ కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా నేరస్తులకు శిక్షపడేలా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో పోలీస్ అధికారులందదరూ పనిలో బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ఏదైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణచర్యలు తప్పవన్నారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో పోలీస్ అధికారులు, సిబ్బంది ఎప్పుడూ రోడ్లపై తిరుగుతూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ సూచించారు. గంజాయి వంటి మత్తుపదార్ధాలు, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘాతో కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లావ్యాప్తంగా హాట్ స్పాట్స్ ను గుర్తించి గంజాయి రవాణా చేసే వ్యక్తులతోపాటు గంజాయి సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించి, తమ తమ నివాస ప్రాంతాల్లో, వ్యాపార సముదాయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చేయాలని తెలిపారు. చోరీ (ప్రాపర్టీ) కేసులలో ప్రస్తుతం పోలీసుశాఖ వినియోగిస్తున్న సాంకేతికత ద్వారా ఆ నేరస్తులను పట్టుకుని సొత్తును రికవరీ చేసి బాధితులకు త్వరతగతిన అందేలా చూడాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదు కోల్పోయినప్పుడు బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు(బ్లాక్ స్పాట్స్) గుర్తించి వాటి నివారణ కోసం సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సూచించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయంతో బాధితులకు న్యాయం చేకూరేలా పని చేయాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి కోసం నిరంతరం వాహనతనిఖీలు చేపట్టి, పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జోనల్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో పతకాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వర్టికల్స్ వారీగా ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు డీఎస్పీలు రెహమాన్, సతీష్ కుమార్, చంద్రభాను, రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, జిల్లాలోని సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

