పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.57వేలు జరిమానా
అధికారులను అభినందించిన ఖమ్మం పోలీసు కమిషనర్
✍️ దివిటీ మీడియా (ఖమ్మం)
పాఠశాలకు వెళ్లిన బాలికను తన మాయ మాటలతో బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి ఒడిగట్టిన నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.57వేలు జరిమానాలు విధిస్తూ, ఖమ్మం మొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు న్యాయమూర్తి డా.పుల్లభట్ల పోగడ కృష్ణ అర్జున్ బుధవారం తీర్పు వెల్లడించారు. ఖమ్మం టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపిన వివరాలు, ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2023 సెప్టెంబర్ 20న జరిగిన ఈ దారుణ ఘటనలో నిందితుడైన సూర్యాపేట జిల్లా, అంజనాపురి కాలనీకి చెందిన అల్లి రాకేష్ కు న్యాయస్థానంలో ఈ శిక్ష విధించారు. అప్పుట్లో ఈ ఘటన జరిగిన సమయంలో ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ బాలిక ఇంటి ప్రక్కనే అల్లి రాకేష్ నివాసముంటున్నట్లు పేర్కొన్నారు. ఆ రోజు పాఠశాలకు వెళ్లిన బాలికను మాయమాటలతో బలవంతం చేసి బయటకు తీసుకెళ్లిన అల్లి రాకేష్, లైంగికదాడికి పాల్పడినట్లు ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్. 425/ 2023. SC.NO .83/2023. U/S 366,376,506 IPC, సెక్షన్.పోక్సో చట్టం -2012 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం ఈ కేసులో విచారణ, సాక్ష్యాధారాల సేకరణ వేగంగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నట్లు తెలిపారు. కేసు పూర్వపరాలు, సాక్ష్యాధారాలు, వైద్యనివేదిక పరిశీలించిన న్యాయమూర్తి, నిందితుడి మీద మోపిన నేరం రుజువు కావడంతో జీవితఖైదు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసులో ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ జమ్ముల శరత్ కుమార్ రెడ్డి వాదించారు. అప్పటి కేసు విచారణాధికారి సీఐ కుమారస్వామి, ప్రస్తుత సీఐ బాలకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమారాణి, కోర్ట్ కానిస్టేబుల్ తల్లా రమణ, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోంగార్డ్ అయూబ్, చిట్టిబాబు లను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

