సీఎస్‌ఆర్ కింద రూ.95.9లక్షలు అందించిన కేటీపీఎస్
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)కింద చేపడుతున్న అభివృద్ధి పనుల కోసం కేటీపీఎస్-7వ దశ నుంచి జిల్లాకలెక్టరు అంకిత్ కు రూ.95,91లక్షలు ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఈ మూడో(తుది) విడత సీఎస్ఆర్ నిధుల చెక్కురూపంలో చీఫ్ ఇంజనీర్ బి.శివరామ్ రెడ్డి కలెక్టర్ అంకిత్‌కు ఐడీఓసీలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్ సివిల్ విభాగం సూపరింటెండింగ్ ఇంజనీర్ యు.గోపతి పాల్గొన్నారు. కేటీపీఎస్ ఇచ్చే సీఎస్‌ఆర్ నిధులతో పాల్వంచ పట్టణంలో ఇందిరా నగర్ నుంచి శివారులోని జగన్నాధపురం వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు సహా పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని వివిధ గ్రామపంచాయతీల పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ అభివృద్ధిపనులకు ఇప్పటివరకు మొత్తం రూ.2,39,70,802 కేటాయించారు. విడతలవారీగా నిధులు విడుదల చేస్తూ, తాజాగా మూడో, తుది విడత నిధుల చెక్కు కలెక్టర్ అంకిత్‌కు అందజేశారు. సీఎస్‌ఆర్ నిధులు సెంట్రల్ లైటింగ్, సీసీరోడ్లు, డ్రైనేజీపనులు, పలు ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు దోహదపడనున్నాయని జిల్లాకలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు సీఎస్‌ఆర్ కార్యక్రమాలతో పరిసర ప్రాంతాల అభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయమన్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా సీఎస్‌ఆర్ నిధులు వినియోగిస్తూ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కేటీపీఎస్-7వ దశ నుంచి ఇచ్చే సీఎస్‌ఆర్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తయితే పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో రహదారులు, డ్రైనేజీలు, విద్యుత్ వెలుగులు అందు బాటులోకి రావడంతోపాటు అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడనున్నాయన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

