Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpecial ArticlesSpot NewsTelanganaWomen

గత అధికారుల పాపాలు… వెంటాడుతున్న శాపాలు…

గత అధికారుల పాపాలు… వెంటాడుతున్న శాపాలు…

అక్రమ ఇసుక రవాణా ‘దారులకు’ అడ్డంగా ‘గొయ్యి’

చర్యలు చేపట్టిన బూర్గంపాడు తహశీల్దార్ శిరీష

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మే 24)

ఇసుక అక్రమ రవాణా నిరోధం కోసం అధికారులు తీసుకుంటున్న చర్యల పట్ల కూడా “ఇదంతా తాత్కాలికమేనా? లేక శాశ్వతమా?” అనే అనుమానాలు కలిగే దుస్థితి నెలకొందంటే గతంలో ఇక్కడ అధికారుల తీరెలా ఉందనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు. బూర్గంపాడు మండలంలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు తహశీల్దార్ శిరీష చర్యలు చేపట్టారు. సారపాకలో గోదావరి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న దారిలో అడ్డంగా కందకాలు తవ్విస్తున్నారు. ఈ మండలంలో అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారాన్ని శుక్రవారం మండల తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లిన ‘దివిటీ మీడియా’ శనివారం ఆ అక్రమం గురించి కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన తహశీల్దార్ శిరీష చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంలో గత అధికారుల నిర్వాకం కారణంగా ప్రస్తుత చర్యలపై స్థానికుల్లో నమ్మకం కలగడం లేదు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు కూడా ఇసుక అక్రమ రవాణా అడ్డుకునేందుకు ఇలాగే కందకాలు తవ్వించిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఇలాగే తవ్వించిన కందకాలను వెంటనే పూడ్చేసిన ఇసుక అక్రమార్కులు తమ దందా యధేచ్ఛగా సాగించేవారు. అయినప్పటికీ మండల అధికారులు వారిపై ఏమాత్రం కఠినంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి అధికారుల చర్యల గురించి కూడా స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మండల అధికారులు చేపట్టిన చర్యలు ఏమాత్రం నీరుగార్చకుండా కొనసాగించాలని వారు కోరుతున్నారు. అవసరమైతే ఇసుక అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో స్పందించిన బూర్గంపాడు తహశీల్దార్ శిరీష, కఠినచర్యలకు సిద్ధం అవుతున్నట్లు ప్రకటించారు. ఆచరణలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే…

Related posts

ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహలక్ష్మి వర్తింప చేయాలి

Divitimedia

పరిశ్రమల ప్రతినిధులతో ఓటుహక్కుపై కలెక్టర్ సమావేశం

Divitimedia

రాష్ట్రంలో వడ్డీలేని రుణాల పంపిణీ ఘనంగా నిర్వహించాలి

Divitimedia

Leave a Comment