ప్రజాసేవలో ‘దేవుడి’గా మారిన అర్చకుడు
తాటికొండ గ్రామంలో గుడి; ఈనెల 4న ‘విగ్రహ ప్రతిష్ట’
✍🏽 దివిటీ – ప్రత్యేక విభాగం (జనవరి 3)
ఆలయంలో అర్చకుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా విశేష సేవలందించిన ఆయన ప్రజల ‘గుండెల్లో గుడి’ కట్టుకున్నారు. తమ గ్రామంలో అర్చకుడిగా ఆధ్యాత్మికత పంచుతూనే ‘ఆయుర్వేద వైద్యుడి’గా ఆరోగ్యం పంచిపెట్టిన ఆయన సేవలను ప్రజలు మర్చిపోలేకున్నారు. ఆయన పట్ల పెంచుకున్న అభిమానంతో తమ ‘గుండెల్లో గుడి’ కట్టుకున్న ప్రజలు ఏకంగా ఆయనకు గ్రామంలోనే ఓ గుడి కట్టారు. జనగామ జిల్లా స్టేషన్ గన్ పూర్ మండలంలోని తాటికొండ గ్రామంలో ఈనెల 4వ తేదీన ఆయన విగ్రహాన్ని ఆ గుడిలో ప్రతిష్టించనున్నారు. తాటికొండ గ్రామానికి చెందిన సౌమిత్రి శ్రీరంగాచార్యులు(68) ఏడాది క్రితం భౌతికకాయం విడిచారు. ఆయన గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో 50 ఏళ్లపాటు పూజలు నిర్వహిస్తూ వచ్చారు. తాటికొండతోపాటు ఆ పరిసర గ్రామాల్లో పౌరోహిత్యం చేస్తూ, మరోవైపు ఆయుర్వేద వైద్యుడిగానూ ప్రజలకు ఉచితంగా మందులు ఇస్తూ, వివిధ రకాల రుగ్మతలకు చికిత్స చేస్తూ దశాబ్దాలపాటు సేవలందించారు. తమకు ఇంతగా సేవలందించిన ఆయనపై ఉన్న అభిమానంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు రూ.6లక్షల వ్యయంతో ఓ ఆలయం నిర్మించారు. ఈ జనవరి 4న(గురువారం) ఆ గుడిలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని దివంగత శ్రీరంగాచార్యులు మనవడు వరుణాచార్యులు, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.



Save or share this story as a newspaper-style Epaper Clip:

