Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StylePoliticsSpot NewsTelangana

మిగిలిన నాలుగు గ్యారెంటీలు కూడా 100 రోజుల లోపు అమలు చేస్తాం

మిగిలిన నాలుగు గ్యారెంటీలు కూడా 100 రోజుల లోపు అమలు చేస్తాం

పాల్వంచలో స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మంత్రులు, ఎమ్మెల్యేలకు ఘనస్వాగతం, సన్మానాలు

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

ఎన్నికల్లో  ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేసిందని, మిగిలిన నాలుగు గ్యారెంటీలు కూడా 100 రోజుల లోపు అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. పదవీ  బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు అడుగడుగున ప్రజలు ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలతో ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పాల్వంచలోని సుగుణా గార్డెన్స్ లో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరావుతోపాటు  ఎమ్మెల్యేలకు అభినందన సత్కారం నిర్వహించారు. పట్టు శాలువాలు కప్పి, పుష్పగుచ్చాలు అందించి మంత్రులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రసంగించారు. ఎన్ని ఆర్థిక సవాళ్లు వచ్చినా వాటిని అధిగమించి ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పదని, ఎప్పుడూ వెనక్కి తీసుకోలేదన్నారు. ఎన్నికల్లో  ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందనే విషయం ఇంటింటికి వెళ్లి ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే గ్యారంటీని నెరవేర్చామన్నారు.
ఆరోగ్య తెలంగాణగా ఉండాలని ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచి  రెండో గ్యారెంటీని అమలు చేశామని, మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా 100 రోజుల లోపు అమలు చేస్తామని వివరించారు. తెలంగాణ ప్రజలు తమకు ఓట్లు వేసి ప్రజల ప్రభుత్వం తెచ్చుకున్నారని చెప్పారు. దశాబ్ద కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన గత ప్రభుత్వంలో ప్రజాసంపదను దోపిడీ చేశారన్నారు. ప్రజాసంపదను గత ప్రభుత్వ పెద్దలు లూటీ చేయడంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసిగి వేసారి పోయిన ప్రజలు మార్పును కోరుకున్నారని చెప్పారు. ప్రజలు మార్పు కోరుకోవడం వల్లే ఖమ్మం జిల్లా లో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో తాము  గెలిచామని చెప్పారు. ప్రజలు కోరుకున్న మార్పునకు అనుగుణంగా, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా,  ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ముగ్గురు మంత్రులం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తమ ప్రభుత్వ హయాంలోనే బహుళార్థ సాధక ప్రాజెక్టులు,  పరిశ్రమలు వచ్చి అభివృద్ధి జరిగిందన్నారు.
గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు.
కొత్తగూడెం నియోజకవర్గం తమకు  కంచుకోటని చెప్పారు.
ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గంలో మిత్రపక్ష  అభ్యర్థిని నిలబెట్టడం జరిగిందన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం వల్ల గెలిపించిన ప్రజలు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారన్నారు. పార్టీకి ద్రోహం చేసి వేరే పార్టీలోకి వెళ్లినందున ఆయనను  ఓడించాలనే కసితో పనిచేసి కూనంనేని సాంబశివరావును గెలిపించిన ప్రజలకు అభినందిస్తున్నామని తెలిపారు.
సాంబశివరావు చాలా మృధు స్వభావి అని, రాజకీయాలు చేయకుండా ప్రజాసేవ చేయాలని నిత్యం ఆలోచన చేసే ఎమ్మెల్యేని గెలిపించుకోవడం ప్రజల అదృష్టమన్నారు.
ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడించాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి సాంబశివరావు కాదని, అందుకే
కొత్తగూడెంలో కూనంనేని సాంబశివరావును గెలిపించు కోవడం వల్ల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు.  ఈ
అభినందన కార్యక్రమంలో పినపాక, ఇల్లందు, సత్తుపల్లి, అశ్వారావుపేట, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, మట్టా రాగమయి, ఆదినారాయణ, డాక్టర్ రాందాస్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

‘బలగం’ సింగర్ మొగిలయ్య మృతి

Divitimedia

గుండాల, కరకగూడెం, ఏడూళ్లబయ్యారం పోలీసుస్టేషన్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ

Divitimedia

“గ్రీవెన్స్ డే”లో జిల్లా ఎస్పీకి సమస్యలు తెలుపుకున్న బాధితులు

Divitimedia

Leave a Comment