పంటల నష్టానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న సీపీఎం
ఎకరాకు రూ.30వేలు పరిహారమివ్వాలని డిమాండ్
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
దుమ్ముగూడెం మండలం బండారుగూడెం, కిష్టాపురం, తూరుబాక, తదితర ప్రాంతాల్లో వరిపొలాలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఎండిపోయాయని సీపీఎం ఆరోపించింది. ఈ మేరకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిశీలించేందుకు సీపీఎం బృందం గురువారం వరిపొలాలను, ఎండిన పైరును పరిశీలించి జరిగిన నష్టం అంచనా వేశారు. ఈ సంధర్భంగా పార్టీ రాష్ట్రకమిటీ సభ్యుడు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రైతుల్ని
తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చర్ల మండలంలోని రైతులు నష్టపోయారని విమర్శించారు. తాలిపేరుప్రాజెక్టులో ఎడమ కాలువకు ఇటీవల కురిసిన వర్షాలకు గండ్లు పడి తెగిపోవడం కారణంగా, మరమ్మత్తులు చేయకపోవడంవల్ల, ప్రాజెక్టునీరు పొలాలకు అందకపోవడంవల్ల, పంటనష్టం జరిగిందని ఆరోపించారు. ఎకరానికి రు.25వేల నుంచి రూ.30వేల వరకు రైతులు ఖర్చు పెట్టారని తెలిపారు. ప్రతి సంవత్సరం పంట రైతులకు చేతికిందే సమయానికి వర్షాభావపరిస్థితి దాపురిస్తున్నందువల్ల ఈ ప్రాంతాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, పంటలు నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలకాలంలో ఇంత వరకూ దుమ్ముగూడెం మండలంలో ఏ ఒక్క గ్రామం గానీ, ప్రాంతాన్ని గానీ సందర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ పంటనష్టానికి ఎమ్మెల్యే వీరయ్య, తెలంగాణ ప్రభుత్వమే కారణమన్నారు. ఎకరానికి నష్టపరిహారంగా రూ.30,000 చొప్పున ఇవ్వాలన్నారు. గత సీపీఎం ఎమ్మెల్యేలు పొలాలగట్లపై నడిచి తిరుగుతూ రైతుల సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లి పరిష్కరించిన ఘనత సీపీఎంకు చెందిన ఎమ్మెల్యేలదేనన్నారు. సీపీఎం పార్టీ భద్రాచలం నియోజవర్గం కో కన్వీనర్ కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యుడు మర్మం చంద్రయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, ఎర్రం మల్లారెడ్డి, అంబటి శ్రీనివాసరెడ్డి, తదితర రైతులు పర్యటనలో పాల్గొన్నారు.