బ్లాక్ మనీ పేరుతో రూ.13లక్షలు మోసం
ఆశచూపి వసూలు చేసిన నిందితుడి అరెస్ట్
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసుస్టేషన్ పరిధిలో సులువుగా డబ్బు తయారుచేసే(బ్లాక్ మనీ) టెక్నిక్ పేరుతో అమాయకులను మోసంచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మంగళవారం పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్ కుమార్, మీడియాకు ఆ కేసు వివరాలు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం… నిందితుడైన పత్తిపాటి ప్రేమ్ చందు బ్లాక్ మనీ తయారు చేసే టెక్నిక్ పేరుతో అశ్వారావుపేటకు చెందిన మధుబాబును మోసం చేశాడు. నల్లటి పేపర్లను ప్రత్యేక రసాయనద్రావణంలో ముంచితే రూ.500 నోట్లు తయారైనట్లు నమ్మించి మదుబాబు నుంచి ముందుగా రూ.11 లక్షలు, ఆ తర్వాత రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలతో కలిపి మొత్తం రూ.13 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు నిందితుడు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడని వెల్లడించారు. ఆ
నిందితుడి వద్ద నుంచి ఇలా మోసానికి ఉపయోగించిన రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20,000 బ్లాక్ పేపర్లు (20 కట్టలు), ఆ బ్లాక్ పేపర్లను డబ్బులుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన 2 రసాయన ద్రావణాల సీసాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. నిందితుడు గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ దొంగతనం వంటి కేసుల్లో బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్పల్లి పోలీసుస్టేషన్లలో నిందితుడిగా జైలుకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఈ నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

