ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఈవీఎం గోడౌన్ ను జిల్లాకలెక్టర్ అంకిత్ మంగళవారం తనిఖీ చేశారు. భారత ఎన్నికలసంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలో ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రతినెలా క్రమం తప్పకుండా గోడౌన్లను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమైన అంశమని, అందుకు అనుగుణంగా అన్ని భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. సీసీ కెమెరా నియంత్రణ గదిని సందర్శించి కెమెరాల పనితీరు, రికార్డింగ్ వ్యవస్థ, విద్యుత్ బ్యాకప్, భద్రతా పర్యవేక్షణ ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీచేశారు. గోడౌన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భద్రతప్రమాణాలు రాజీపడకుండా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమతిలేని వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరాదని గోడౌన్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. గోడౌన్ పరిసరాల్లో భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ ఏ లోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గోడౌన్ తనిఖీ రిజిస్టర్లను పరిశీలించి సంతకం చేశారు. తనిఖీలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రంగప్రసాద్, సిబ్బంది నవీన్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

