Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsHyderabadLife StyleSpecial ArticlesTelanganaWELFAREWomen

బూర్గంపాడు ఐకేపీలో ఆగని అక్రమాలు

బూర్గంపాడు ఐకేపీలో ఆగని అక్రమాలు

వరుస కుంభకోణాలతో చిత్తవుతున్న పేదలు

ఫలితంలేని విచారణలతో కాలక్షేపం…

కఠినచర్యలు తీసుకుంటేనే దోపిడీకి అడ్డుకట్ట

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి

(దివిటీ మీడియా)

”కంచే చేనుమేసిన” చందంగా నిరుపేద మహిళల సొమ్ము నిక్షేపంగా కాజేస్తున్న సిబ్బందితో పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతున్నాయి… ఓవైపు పేదరికంలో నుంచి బయటపడేసి ‘మహిళలందరినీ కోటీశ్వరులుగా మారుస్తామని’ ప్రభుత్వం చెప్తుంటే, ఇక్కడ మాత్రం పేద మహిళల సొమ్మును ఐకేపీ సిబ్బందే లక్షలకులక్షలు స్వాహాచేస్తూ దోచేస్తున్నారు. పేదరికంలో మగ్గుతున్న మహిళలకు చేయూతనిచ్చి ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యం ప్రధానబాధ్యతగా పనిచేయాల్సిన సంస్థ, వారినే దోచుకునే దుస్థితి దాపురించడం గమనార్హం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో మహిళలను దివాలా తీయుస్తున్న ఐకేపీ పనితీరుపై అందిస్తున్న ప్రత్యేక కథనమిది…
బూర్గంపాడు మండలంలో పనిచేస్తున్న ఐకేపీ సిబ్బంది అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మహిళలకు ఆర్థిక అక్షరాస్యత పెంచి, వారి అభివృద్ధికోసం పనిచేయాల్సిన సిబ్బందే అక్రమాలకు పాల్పడుతుండటంతో పలు కుటుంబాల పరిస్థితులు అగమ్యగోచరంగా తయారై అవస్థలు పడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో గతేడాది బయటపడిన నిధుల స్వాహాపర్వం మర్చిపోకముందే తాజాగా మరిన్ని కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బూర్గంపాడులో ఓ వీఓఏ, సీసీ, అధికారుల సహకారంతో నిరుపేద మహిళల కష్టార్జితం దాదాపు రూ.30లక్షలకు పైగానే స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ‘వీఓఏ’, ‘సీసీ’తో కుమ్మక్కై ఇంత భారీమొత్తంలో ‘శ్రీనిధి’ రుణాల రికవరీ డబ్బు, బ్యాంకు లింకేజీ డబ్బు తినేశారని తెలుస్తోంది. ఆ డబ్బుతో సదరు ‘వీఓఏ’, ‘సీసీ’లు జల్సా చేసినట్లు సమాచారం. బూర్గంపాడులో ప్రస్తుతం 62 గ్రామసమాఖ్యలుండగా, ఆ గ్రామసమాఖ్యల లావాదేవీల్లో నిరుపేద డ్వాక్రా మహిళల డబ్బుకు భద్రత కరవై పోతోంది. మహిళల సొమ్మును సిబ్బందే ఎవరికి దొరికినంత వారు స్వాహా చేస్తూ దోచేస్తున్నారు. గతంలో మండలంలోని మోరంపల్లిబంజర్, ముసలిమడుగు, తదితర ప్రాంతాల్లో 8 గ్రామ సమాఖ్యల్లో భారీమొత్తంలో శ్రీనిధి రుణాల రికవరీ సొమ్ము దాదాపు రూ.50 లక్షల వరకు స్వాహా చేశారు. స్వాహాపర్వంలో పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిబ్బందిపై చర్యలతో పాటు డబ్బుల రికవరీ నామమాత్రంగా మారిందనే విమర్శలున్నాయి. ఆ దుస్థితి అలా ఉండగానే బూర్గంపాడులో జరిగిన స్వాహాపర్వంపై కనీసం విచారణ కూడా జరగకపోవడం ఉన్నతాధికారుల మీద కూడా పలు అనుమానాలకు అవకాశం కల్పిస్తోంది. ఈ వ్యవహారంలో కీలకమైన పాత్ర పోషించిన సిబ్బంది చర్యల నుంచి తప్పించుకునేందుకు తమకు రాజకీయ పలుకుబడి ఉందంటూ అధికారులను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మండలంలోని పినపాకపట్టీనగర్ గ్రామంలో ఓ గ్రామ సమాఖ్యలో దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల దాకా స్వాహా జరిగినట్లు చెప్తున్నారు. దీనిపై అక్కడి వీఓఏ, సీసీలు ఒకరిమీద ఒకరు నెపం నెట్టేసుకుంటున్నారు. దీంతో ఈ బాధితులు తలలు పట్టుకుంటూ తమ కష్టార్జితం తిరిగి తమకు దక్కుతుందో? లేదో? నని ఆందోళన చెందుతున్నారు. ఈ అక్రమాల పరిస్థితి ఇలా ఉంటే కొంత కాలం క్రితం సారపాకలో బయట పడిన దాదాపు రూ.30 లక్షల కుంభకోణంలో కూడా ఉన్నతాధికారులు ఎవరిపైనా ఏ చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విధంగా బూర్గంపాడు మండలంలోనే ఐకేపీలో సాక్షాత్తూ సిబ్బందే మహిళల సొమ్ములు స్వాహా చేస్తున్న తీరు గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. వీటిపై ఉన్నతాధికారులు అత్యంత కథినమైన చర్యలు తీసుకోకపోయినట్లయితే, ఇంకా మరిన్ని దారుణాలు చోటు చేసుకునేలా ఉన్నాయని పలువురు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

—————————
విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం : అడిషనల్ కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన
——————-‐——-
బూర్గంపాడు మండలంలో ఐకేపీలో చోటు చేసుకుంటున్న ‘నిధుల స్వాహా’పై విచారణ జరిపిస్తామని జిల్లా అడిషనల్ కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన ‘జనోదయ ప్రతినిధి’కి వివరించారు. ఈ వ్యవహారాల్లో బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ అక్రమాలు జరుగకుండా అన్ని గ్రామ సమాఖ్యల లావాదేవీలపై ‘ఆడిట్’ జరిపిస్తామని, రికవరీలపై తగు చర్యలు తీసుకుంటామని వివరించారు.

By: కామిరెడ్డి నాగిరెడ్డి  |  Source: దివిటీ మీడియా

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినచర్యలు

Divitimedia

‘ఏఐ’తో బోధన విద్యార్థుల పాలిట వరం

Divitimedia

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి : కలెక్టర్

Divitimedia

Leave a Comment