Divitimedia
Bhadradri KothagudemEducationHealthHyderabadLife StyleSpot NewsTelangana

వరదబాధితులను కాపాడేందుకు అగ్రికల్చర్ డ్రోన్లు ఉపయోగించండి

వరదబాధితులను కాపాడేందుకు అగ్రికల్చర్ డ్రోన్లు ఉపయోగించండి

గోదావరి వరదల ముందస్తు సమీక్షలో జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్

✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ మీడియా (జూన్ 18)

గోదావరి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఈసారి ప్రయోగాత్మకంగా అగ్రికల్చర్ డ్రోన్లను ఉపయోగించి, డ్రోన్ ద్వారా తాడును బాధితులకు చేరవేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. వరదలలో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ప్లడ్ మేనేజ్మెంట్ ప్రణాళిక తయారు చేయాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన గోదావరి వరదల ముందస్తు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారులకు పలు సూచనలు చేశారు. వరదముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ముంపునకు గురయ్యే వరకు వేచి ఉండకుండా ముందుగానే బాధిత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. వరదల్లో ప్రజలను కాపాడేందుకు గ్రామస్థాయి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సన్నాహక సమావేశంలో దిశానిర్దేశం చేసిన ప్రకారం అన్నిశాఖల అధికారులు సమగ్రకార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న వ్యక్తులను రక్షించేందుకు లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, నాటుపడవలు, బోట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. రానున్న నాలుగు నెలల వరకు, అక్టోబర్ నెల వరకు సరిపోను అన్ని రకాల నిత్యావసర వస్తువులు నిల్వ ఉంచాలని జిల్లా పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. వరద సహాయక చర్యల పర్యవేక్షణకు సెక్టోరల్, జోనల్ అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. వరద సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు ముంపు గ్రామాల ప్రజల ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. విద్యుత్తు అంతరాయం లేకుండా పంచాయతీరాజ్, విద్యుత్తు శాఖ అధికారులు ముందస్తుగానే ముంపు గ్రామాల్లో పరిశీలన చేయాలని, ముంపునకు గురయ్యే అవకాశాలున్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. అత్యవసర సేవలకు హెలికాప్టర్లు వినియోగించుకోవడానికి అనుగుణంగా హెలిప్యాడ్లు ఏర్పాటు చేయాలని రహదారులు భవనాల శాఖ అధికారులకు సూచించారు. అత్యవసర సేవల కోసం మొబైల్ సెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. గోదావరికి పైనుంచి వచ్చే వరద సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తుండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించేందుకు ప్రాధాన్యతలను తెలియచేసి, ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం తయారు చేసేందుకు వంట చేసే సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలూ నిరంతరాయంగా పనిచేసే విధంగా ఫ్లడ్ కంట్రోల్ రూము ఏర్పాటుతో పాటు మండల, జిల్లాస్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని చెప్పారు. వరదల సమయంలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాబితా సిద్ధంచేసి సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రాథమికఆరోగ్యకేంద్రంలో ఈడీడీ క్యాలెండర్ తప్పనిసరిగా ఉండాలని, తనిఖీలో భాగంగా ఏదైనా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఈడీడీ క్యాలెండర్ అందుబాటులో లేనట్లయితే షాకాజ్ నోటీస్ జారీ చేస్తామని వైద్యశాఖాధికారులను కలెక్టర్ హెచ్చరించారు. 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని, ప్రమాదం జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, ప్రాథమికవైద్యంపై సిబ్బందికి శిక్షణనివ్వాలని వైద్యశాఖాధికారులను ఆదేశించారు. వరదల సమయంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటే ప్రజలు దాటే ప్రయత్నం చేయకుండా బారికేడింగ్ చేయాలని చెప్పారు. వాగులు దాటించడం వల్ల ప్రజలతోపాటు పశువులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశాలున్నాయని, కాబట్టి ముందస్తుగానే ప్రజలకు సమాచారం చేరవేసి రక్షణ చర్యలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం లేకుండా మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పాము, తేలుకాటు వంటి విషకీటకాలకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని, వ్యాక్సిన్ అందక ఎటువంటి ప్రాణ నష్టం జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులకు తెలిపారు. సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, నవభారత్ తదితర సంస్థల రెస్క్యూ టీముల సేవలు వినియోగించుకునేందుకు జాబితా అందుబాటులో ఉంచాలని చెప్పారు. వర్షాకాలంలో పశువులు వ్యాధులకు గురికాకుండా టీకాలు వేసే కార్యక్రమాలు చేపట్టాలని పశుసంర్దక అధికారులను ఆదేశించారు. గుత్తికోయ ఆవాసాల్లో పర్యటించి వారికి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. పల్లపు ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా డ్రెయిన్లు పరిశుభ్రపరచడం, డ్రైయిన్ల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పారు. విస్తా కాంప్లెక్సు, అశోక్ నగర్ ప్రాంతాలలో నీటి నిల్వలు లేకుండా ఎత్తి పోసేందుకు మోటార్లను అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. వరదనీరు నిల్వ లేకుండా వెళ్లేందుకు డ్రెయిన్లను పరిశుభ్రం చేయాలని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని బ్లీచింగ్, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయించాలని చెప్పారు. మంచినీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా చూడాలని నీటి వనరులు ముంపునకు గురైతే మంచినీటి సరఫరాకు ఇబ్బంది రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో మంచినీటి ట్యాంకులను ఈనెల 21 నాటికి పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో శుభ్రపరచాలని, దానిని ఎంపీడీఓ ధ్రువీకరించాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వల్ల ఒక్క ప్రాణ నష్టం జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలుంటాయని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జిల్లాలో 3న మంత్రి పొంగులేటి పర్యటన

Divitimedia

జడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్

Divitimedia

టెట్ పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్

Divitimedia

Leave a Comment