Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadLife StylePoliticsSpot NewsTechnologyTelanganaYouth

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లాకలెక్టర్

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లాకలెక్టర్

✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (నవంబరు 20)

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో, ఆ ఏర్పాట్లను జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ గురువారం పరిశీలించారు. ఆ క్యాంపస్ మొత్తం పరిశీలించిన కలెక్టర్ అకడమిక్ బ్లాక్, ఆడిటోరియంలలో మరమ్మతులు, బాలుర కామన్ మెస్, బాలికల హాస్టల్ పనుల పురోగతిపై సంబంధిత శాఖలతో సవివరంగా చర్చించారు. ఆ పనులన్నీ నాణ్యతతో పూర్తవ్వాలని ఆదేశించారు.
యూనివర్సిటీ పాత, కొత్త భవనాల సుందరీకరణ, పార్కింగ్ ప్రాంతాల అభివృద్ధి, క్యాంపస్ పరిశుభ్రత, లైటింగ్ పనులు పరిశీలించిన కలెక్టర్ సూచనలు చేశారు. సీఎం ఆవిష్కరించే శిలాఫలకం వద్ద ఏర్పాట్లు ఆకర్షణీయంగా, సముచిత ప్రమాణాలతో ఉండాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల వసతిగృహాల్లో ఫర్నిచర్ అమరిక, నీటి సదుపాయాలు, టాయిలెట్స్ మరమ్మతులు, వసతులలో పరిశుభ్రత, తదితర అంశాలను ఆయన సమీక్షించారు. ఆవరణంతా పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటడంతోపాటు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఎర్త్ సైన్సెస్ విద్యాలయం ప్రిన్సిపల్ డాక్టర్. జగన్మోహన్ రాజును ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జిల్లాకు అత్యంత ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని, అన్ని ఏర్పాట్లు అత్యున్నత నాణ్యతతో పూర్తవ్వాలని సూచించారు. విద్యారంగం పరంగా జిల్లాకు ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని, కార్యక్రమం విజయవంతం చేయడం అన్ని శాఖల సమిష్టి బాధ్యతని స్పష్టం చేశారు. అత్యంత వేగంగా శ్రద్ధతో పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అక్కడి అధికారులను ఆదేశించారు. జిల్లాకలెక్టర్ వెంట కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సుజాత, పంచాయతీరాజ్ శాఖ ఈఈ శ్రీనివాస్, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Related posts

16న జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు

Divitimedia

ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి

Divitimedia

కిన్నెరసాని ప్రాంతం సందర్శించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment