విత్తనాల సేకరణ ద్వారా పర్యావరణంపై అవగాహన

నెల్లిపాకబంజర విద్యార్థులను అభినందించిన కలెక్టర్
✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 15
‘సీడ్ బ్యాంక్’ పేరుతో చేపట్టిన విత్తనాల సేకరణ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన పెరుగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అన్నారు. అశ్వాపురం మండలం నెల్లిపాకబంజర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్) విద్యార్థులు సీడ్ బ్యాంక్ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో మొదటి బహుమతిని సాధించడం గర్వకారణమని అభినందించారు. ఆ పాఠశాలను సోమవారం సందర్శించిన కలెక్టర్, విద్యార్థులు సేకరించిన విత్తనాలను పరిశీలించారు. విత్తనాల సేకరణ కేవలం ఓ పోటీ మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణకు పునాది అని, విత్తనాల సంరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు అందించగలుగుతామన్నారు. జీవనాధారమైన ప్రతి విత్తనం ఔషధ విలువలు, ఆహారభద్రత, జీవవైవిధ్యాన్ని కాపాడుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా సీడ్ కలెక్షన్‌లో భాగంగా అత్యధికంగా 362 రకాలైన, 440 కిలోల విత్తనాలను సేకరించినందుకు విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కృషితోపాటు ఉపాధ్యాయులు, సిబ్బంది చూపిన నిబద్ధత ప్రశంసనీయమన్నారు. పాఠశాలలోనే ఒక నర్సరీ ఏర్పాటు చేసి, వివిధ రకాల మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అక్కడే పాఠశాల ప్రాంగణంలో సీడ్ గిఫ్ట్ బాక్స్ ఏర్పాటు చేసి, సమాజంలో విత్తనాల మార్పిడి, పంపిణీకి అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లాస్థాయి సీడ్ బ్యాంక్ పోటీల్లో విజయం సాధించినందుకు ఈ పాఠశాలకు ఇవ్వబోయే రూ.50,000 నగదు బహుమతితో పాటు, అదనంగా నిధులు కేటాయించి విద్యార్థులను ఇంకా ప్రోత్సహిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, అశ్వాపురం ఎంఈఓ వీరాస్వామి, ప్రధానోపాధ్యాయులు విమల, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

