సహాయక చర్యల్లో అలసత్వంపై సీఎం ఆగ్రహం

భారీవర్షాల నష్టాలపై అధికారులకు ఆదేశాలు
✍️ దివిటీ – హైదరాబాద్ (సెప్టెంబర్ 1)
ఇటీవలి భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, భవనాలు, చెరువులు, కుంటలకు మరమ్మతులు చేపట్టడంతో పాటు విద్యుత్ సబ్ స్టేషన్ల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విపత్తు ఉపశమన నిధులు (ఎస్డీఆర్ఎఫ్) అందుబాటులోనే ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం వాటిని ఖర్చు చేయడంలో అలసత్వం చూపడం పట్ల అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీవర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాలపై ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్షతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, పశువులు కోల్పోయిన కుటుంబాలకు తక్షణమే పరిహారం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
గతేడాది ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలతో వాటిల్లిన తీవ్రనష్టానికి కేంద్రం నుంచి రావలసిన సాయం అందక పోవడంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి ఆ వివరాలతో పాటు ప్రస్తుత వరదల వల్ల నష్టాలకు సంబంధించిన వివరాలతో సమగ్రమైన నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని బృందం ఈనెల 4న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి ఆ రెండు నివేదికలకు అందజేస్తుందని చెప్పారు.
వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 257 చెరువులు, కుంటలకు గండి పడినట్టు అధికారులు చెప్పగా, ముఖ్యమంత్రి స్పందిస్తూ, చిన్న నీటిపారుదల విభాగం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఆర్ఆర్ఆర్, ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన, తదితర కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వినియోగించుకొని చిన్న నీటివనరులకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. గతంలో నీటి వినియోగదారుల సంఘాల ఆధ్వర్యంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా సంఘాలు ఉండేవని, వాటికి సంబంధించిన నిబంధనలు పరిశీలించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు నూతన ప్రతిపాదనలతో నివేదించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. దానిపై మంత్రివర్గంలో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని 82 మండలాల్లో 2.36 లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు రూపొందించిన ప్రాథమిక అంచనాలపై స్పందిస్తూ, రెండు రోజుల్లో పూర్తివివరాలతో కూడిన సమగ్ర నివేదిక సమర్పిస్తే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నీట మునిగిన సబ్ స్టేషన్ల స్థానంలో ఆధునాతన సామగ్రి, సామర్థ్యంతో కూడిన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శిని సీఎం ఆదేశించారు. పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు, జీహెచ్ఎంసీ పరిధిలో వీధిదీపాల నిర్వహణపై సమీక్ష నిర్వహించి, తగిన పరిష్కారంతో తన వద్దకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావుకు సూచించారు. ఆర్.. అండ్.బి, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, పశు సంవర్ధక శాఖలు కూడా రెండు రోజుల్లో సమగ్ర నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. సీఎం ఈ సందర్భంగా కామారెడ్డి, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, పరిహారాలు వెంటనే విడుదల చేయాలని ఆదదేశించారు. అన్ని శాఖలు ఎస్డీఆర్ఎఫ్ నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు సకాలంలో వినియోగితా పత్రాలు (యూసీ) సమర్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విపత్తు సమయాల్లో స్పందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ దళాలు వరదల సమయంలో మెరుగైన సేవలందించాయని అభినందనలు తెలిపారు. భారీ వర్షాల సమయంలో 42 ఆపరేషన్లలో, 217 మందిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సిబ్బందికి మరింత మెరుగైన శిక్షణ, నైపుణ్యాలు అందేలా చూడాలని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తుస్పందన, పౌర సహాయక విభాగం డైరెక్టర్ జనరల్ కు సీఎం సూచించారు.
వాతావరణ పరిస్థితుల్లో మార్పులతో మున్ముందు అకాల వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉన్నందున జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని, విపత్తుల సమయంలో తక్షణమే క్షేత్రస్థాయికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న జిల్లాల్లో పనులకోసం కంటింజెన్సీ కింద కలెక్టర్లకు రూ.10కోట్లు చొప్పున, సాధారణ నష్టం వాటిల్లిన జిల్లాల కలెక్టర్లకు రూ.5 కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. ఈ సమీక్షసమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

