వరంగల్ నేషనల్ హైవేస్ పీడీని అరెస్టు చేసిన సీబీఐ
రూ.60వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన పీడీ దుర్గాప్రసాద్
✍️ హైదరాబాద్ – దివిటీ (ఆగస్టు 20)
జాతీయ రహదారుల సంస్థ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీఐయూ విభాగం) గోళ్ల దుర్గాప్రసాద్ తోపాటు వేణుయాదవ్ అనే మరో ప్రైవేట్ వ్యక్తిని సీబీఐ అరెస్టు చేసింది. బుధవారం ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనలో సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం…
గూడూరు టోల్ ప్లాజా వద్ద రెస్టారెంట్ యజమానుల వద్ద దుర్గాప్రసాద్ రూ.60 వేలు లంచం తీసుకుంటున్న క్రమంలో సీబీఐ ఆయనను ఆయనకు సహాయం చేసిన వేణుయాదవ్ ను సీబీఐ వలపన్ని పట్టుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడు అయిన ఆ రెస్టారెంట్ యజమానిని టోల్ ప్లాజా వద్ద వ్యాపారం చేసుకుంటున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు దుర్గాప్రసాద్, రూ.1లక్ష డిమాండ్ చేశారని సీబీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. అక్కడ తన ఐదేళ్ల ఉద్యోగబాధ్యతల సమయంలో ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు ఆయన రూ.1 లక్ష డిమాండ్ చేసి, చర్చల తర్వాత రూ.60వేలకు అంగీకరించినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఆ లంచం తీసుకుంటున్న క్రమంలో దాడి చేసి పీడీ దుర్గాప్రసాద్, ప్రైవేటు వ్యక్తి వేణుయాదవ్ లను పట్టుకున్నట్లు తెలిపింది. కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, వరంగల్, సదాశివపేట్ లలో సోదాలు నిర్వహించి, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. దర్యాప్తు కొనసాగుతున్నట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు.