Divitimedia
Bhadradri KothagudemEducationHealthLife StyleSpecial ArticlesTelanganaWomen

“అన్నపు చొరవే గాని… అక్షరపు చొరవ లేదు…”

“అన్నపు చొరవే గాని… అక్షరపు చొరవ లేదు…”

అరకొరగానే అంగన్వాడీ కేంద్రాల పనితీరు

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 13)

“అన్నపు చొరవే గాని… అక్షరపు చొరవ లేదు…” అనేది ఓ సామెత… ఈ సామెతను పెద్దలు ఏ సందర్భంలో వాడారో తెలియదు గానీ, ప్రస్తుతం ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుకు అతికినట్లు ఉంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక అంగన్వాడీ కేంద్రాలు కేవలం ‘అన్నపు చొరవ’కే పరిమితమవుతున్నాయి. ఈ మేరకు మంగళవారం బూర్గంపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ‘దివిటీ మీడియా’కు ఆసక్తికరమైన దృశ్యాలు కనిపించాయి. ఈ పరిస్థితులపై దివిటీ మీడియా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది…

చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యం పరిరక్షించడం కోసం ప్రభుత్వం అన్ని గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4-30గంటల వరకు చిన్నారుల వికాసానికి అవసరమైన కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా ‘టైంటేబుల్’ ఏర్పాటుచేసింది. అంగన్వాడీ కేంద్రాలన్నీ ఈ వేళలు పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో గర్భిణులు, బాలింతలకు కూడా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పోషకాహారం అందించాలని నిర్దేశించారు. ప్రాథమికంగా అత్యంత కీలకమైనదిగా అందరూ ఆలోచించే ఈ పనితోపాటు, చిన్నారులకు అంతకంటే ముఖ్యమైన ‘మానసిక వికాసం’ కోసం ఆట పాటలతో కూడిన విద్యాభ్యాసం (శిక్షణ) ఇవ్వాలనేది అసలు లక్ష్యం. ఈ కార్యకలాపాలతోపాటు మధ్యాహ్నం సమయంలో పౌష్టికాహారం అందించిన అనంతరం ఆ చిన్నారులకు కొంతసేపు విశ్రాంతి కల్పించి, ఆ తర్వాత మరిన్ని ఆటపాటలతో శారీరక వ్యాయామం కూడా లభించే విధంగా అంగన్వాడీ టీచర్లు, ఆ చిన్నారుల ‘ఆల్ రౌండ్’ వికాసానికి తోడ్పాటునందించాల్సి ఉంది. ప్రాథమికంగా మూడేళ్ల వయసు నుంచే అందించిన ఈ శిక్షణ, శారీరక రక్షణతో బలమైన, తెలివైన భావిభారత పౌరులుగా అందరు చిన్నారులను తీర్చిదిద్దాలనేదే ఈ అంగన్వాడీలకు ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం.

రేపటి పౌరులను అత్యున్నతంగా తీర్చిదిద్దాల్సినంతటి గురుతర బాధ్యత కలిగిన అంగన్వాడీలలో ప్రస్తుతం లభిస్తున్న సేవలు, కార్యకలాపాలను పరిశీలిస్తే ఎంతటి దారుణమైన దుస్థితిలో ఉన్నాయనేది అర్థమవుతోంది. 11 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 2060 అంగన్వాడీ కేంద్రాలున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 60 శాతం కేంద్రాల్లో కేవలం ‘అన్నం పెట్టే’ సేవలతో ‘మమ’ అనిపిస్తున్న దుస్థితి నెలకొన్నట్లు అంచనా. కొందరు అంగన్వాడీ టీచర్లు అత్యున్నత ప్రమాణాలతో తమ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తుండగా, ఎక్కువగా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ‘దివిటీ మీడియా’ బూర్గంపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టులో కొన్ని అంగన్వాడీ కేంద్రాలు పరిశీలించగా, మధ్యాహ్న భోజనం తర్వాత మూతబడిన దుస్థితి కనిపించింది.

  • బూర్గంపాడు మండల కేంద్రంలోని గౌతంపురం అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్నం 2-45 గంటలప్పుడు ఆయా ‘రెస్ట్’ తీసుకుంటుండగా చిన్నారులెవరూ లేరు. టీచర్ అప్పుడే పనిమీద బయటకు వెళ్లారని ఆమె చెప్పారు.
  • గొమ్మూరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి మధ్యాహ్నం 3 గంటలప్పుడు తాళం వేసి ఉంది. మధ్యాహ్నం ఆహారం అందించిన తర్వాత ఆ అంగన్వాడీ టీచర్ వెళ్లిపోయారని అక్కడి ఉపాధ్యాయుడు, స్థానికులు చెప్పారు.
  • పాతసారపాక అంగన్వాడీ కేంద్రంలో మధ్యాహ్నం 3-15 గంటలకు పరిశీలిస్తే, అక్కడ అంగన్వాడీ టీచర్, ఆయా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చిన్నారులను కొంతసేపటి క్రితమే ఇళ్లకు పంపించామని చెప్పారు. ఆ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజు పౌష్టికాహారంలో భాగంగా ఇవ్వాల్సిన ‘గుడ్లు’ లేనేలేవు. ఒకరోజు క్రితమే ‘స్టాక్’ అయిపోయిందని, కాంట్రాక్టర్లు తెస్తామని చెప్పారని ఆ అంగన్వాడీ టీచర్ తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఐటీసీ-ప్రథమ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

Divitimedia

భగవాన్ దాస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ అన్నప్రసాద వితరణ

Divitimedia

JUNIOR ENGINEER (CIVIL, MECHANICAL & ELECTRICAL) EXAMINATION, 2024

Divitimedia

Leave a Comment