Divitimedia
Bhadradri KothagudemEducationEntertainmentHealthLife StyleTelanganaWomen

‘అంగన్వాడీ బాట’ లో ‘గుడ్లు’ తేలేస్తున్నారు…

అంగన్వాడీ బాట’ లో ‘గుడ్లు’ తేలేస్తున్నారు…

అరకొరగా ‘అమ్మ మాట… అంగన్వాడీ బాట’ తీరు

✍️ బూర్గంపాడు – దివిటీ (జూన్ 11)

“దున్నపోతు ఈనిందంటే… దూడను కట్టేయమని…’ చెప్పాడంట వెనకటికి ఓ పెద్దమనిషి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పని తీరు కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి… రాష్ట్రంలో ‘అమ్మ మాట… అంగన్వాడీ బాట’ పేరుతో మంగళవారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర, జిల్లా అధికారులు ఆదేశించారు. తెలంగాణలో రాష్ట్రవ్యాప్త కార్యక్రమంగా నిర్వహిస్తున్న ‘అమ్మమాట… అంగన్వాడీ బాట…’ లో భాగంగా చిన్నారులకు ‘ఎగ్ బిర్యానీ’తో ఆహారం పెట్టాలని, వారంతా అంగన్వాడీ కేంద్రాలకు ఉత్సాహంగా వచ్చేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క, ఉన్నతాధికారులు అంగన్వాడీ టీచర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులను పోషకాహారం ఇచ్చే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా ఆకర్షించాలనేది అసలు లక్ష్యంగా ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆచరణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని బూర్గంపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టులో నెలకొన్న దుస్థితి గురించి ఏ ఒక్క అధికారి పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దాదాపు 180 వరకు అంగన్వాడీ కేంద్రాలున్న బూర్గంపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ప్రస్తుతం సగం కేంద్రాలలో ‘కోడిగుడ్లు’ లేనేలేవని టీచర్లు చెప్తున్నారు. ఈ దుస్థితి నడుమ తాము ప్రత్యేక కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలంటూ వాపోతున్న దుస్థితి. మే నెలలో వేసవి సెలవుల వల్ల అంగన్వాడీ కేంద్రాలు పనిచేయలేదు. ఆ తర్వాత జూన్ నెల మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ‘కోడిగుడ్లు’ సరఫరా కాక పోవడంతో చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందని దుస్థితి నెలకొంది. ఏ ఏ అంగన్వాడీ కేంద్రంలో ఏ ఏ ఆహార పదార్థాలు ఎంతెంత ‘స్టాక్ ఉన్నాయనేది అంగన్వాడీ టీచర్ల నుంచి వివరాలు తీసుకున్న అధికారులు, కనీసం కోడిగుడ్ల సరఫరా పరిస్థితిని పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు తెలుస్తోంది. ఈ దుస్థితి కారణంగా ‘అమ్మమాట… అంగన్వాడీ బాట…’ కార్యక్రమం కూడా సరిగా నిర్వహించని దుస్థితి ఏర్పడింది. కోడిగుడ్లతో పాటు పలు కేంద్రాల్లో పాలు, మంచినూనె కూడా లేవంటున్నారు. ఈ దుస్థితిపై లబ్దిదారులు, స్థానికులు కూడా సంబంధిత అంగన్వాడీటీచర్లను నిలదీసి అడుగుతున్నట్లు తెలుస్తోంది. కోడిగుడ్లు, ఇతర ఆహార పదార్థాల కొరతపై తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, స్టాక్ రాగానే పంపిణీ చేస్తామని అంగన్వాడీ టీచర్లు లబ్దిదారులను బతిమాలుకునే పరిస్థితులేర్పడ్డాయి. కొన్నిచోట్ల టీచర్లు సాకులు చెప్తూ తమకివ్వాల్సిన గుడ్లు, నూనె వంటివి అమ్ముకుంటున్నారంటూ అనుమానంతో స్థానికులు గొడవపడటం జరుగుతోందని టీచర్లు వాపోతున్నారు. ఈ దుస్థితిపై చర్యలు తీసుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్నతాధికారులు ఈ బూర్గంపాడు ప్రాజెక్టులో సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలో మరికొన్ని చోట్ల కూడా ఇదే రకమైన దుస్థితి ఉంటుందని సమాచారం. పదిరోజులకు పైగా గుడ్లు లేకుండా అంగన్వాడీ కేంద్రాలు ఎలా నడుస్తున్నాయో? అర్థం కావడం లేదని, అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యధోరణిని వీడి, చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

Related posts

భగవాన్ దాస్ కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ అన్నప్రసాద వితరణ

Divitimedia

కొత్తగూడెంలో నలుగురు బంగ్లాదేశీయుల అరెస్టు

Divitimedia

రైతు రుణమాఫీకి అవసరమైతే ‘స్పెషల్ కార్పొరేషన్’…

Divitimedia

Leave a Comment