ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ, సీఐ
రూ.25లక్షలు లంచం డిమాండ్, రూ.16లక్షలకు తగ్గింపు
✍️ హైదరాబాద్, సూర్యాపేట – దివిటీ (మే 12)
ఓ కేసులో నిందితుడిగా నమోదైన వ్యక్తిని అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.16లక్షలు లంచం అడిగిన డీఎస్పీ, సీఐ తెలంగాణ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం… సూర్యాపేట డీఎస్పీ కె.పార్థసారథి, పట్టణ సీఐ(ఇన్‌స్పెక్టర్) పి.వీరరాఘవులు ఒక కేసులో వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, కేవలం నోటీసు మాత్రమే ఇవ్వడానికి, అతని స్కానింగ్ సెంటర్ సజావుగా నిర్వహించుకునేలా అనుమతించడానికి భారీగా లంచం డిమాండ్ చేశారు. అతని నుంచి మొదటగా రూ.25లక్షలు లంచం డిమాండ్ చేసిన ఆ అధికారులు, ఆ వ్యక్తి అభ్యర్థన మేరకు రూ.16లక్షలకు తగ్గించి అంగీకరించారు. ఈ మేరకు ఆ వ్యక్తి తెలంగాణ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు(ఉద్యోగి) అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ ‘1064’ కు డయల్ చేయాలని ఏసీబీ కోరింది. అదే కాకుండా వివిధ సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్ – 9440446106, ఫేస్ బుక్ – Telangana ACB, ఎక్స్ – @TelanganaACB, వెబ్ సైట్ – acb.telangana.gov.in ద్వారా కూడా తెలంగాణ ఏసీబీని సంప్రదించవచ్చని పేర్కొంది. ఫిర్యాదుధారులు / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా ఏసీబీ ప్రకటించింది.

