Divitimedia
BusinessHyderabadLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

భూసమస్యలకు శాశ్వత పరిష్కారం ధ్యేయంగా…

భూసమస్యలకు శాశ్వత పరిష్కారం ధ్యేయంగా…

భూభారతి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

✍️ హైదరాబాదు – దివిటీ (ఏప్రిల్ 14)

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తీసుకొచ్చిన ‘భూ భారతి’ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని కోరారు. తెలంగాణలో వివాద రహిత భూ విధానాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమని స్పష్టం చేశారు. ఆధార్ తరహాలో భవిష్యత్తులో భూమికి సంబంధించి సర్వే చేసి కొలతలు, హద్దుల వంటి సమగ్రమైన వివరాలతో ‘భూధార్’ తీసుకొస్తామని ప్రకటించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ భారతి చట్టం, భూ భారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతు కమిషన్ చైర్మన్, సభ్యులతో పాటు రెవెన్యూ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పైలట్ ప్రాజెక్టుగా తొలివిడత భూ భారతిని నాలుగు మండలాల్లో చేపడుతామని వెల్లడించారు. ప్రజా పోరాటాల నుంచి పుట్టుకొచ్చిన రెవెన్యూ చట్టాలు, ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని, రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం వివరించారు. గత పాలకుల తరహాలో రెవెన్యూ సిబ్బందిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు ప్రజా ప్రభుత్వం వ్యతిరేకమన్నారు. అవినీతికి పాల్పడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని, కానీ వ్యవస్థపై కాదన్నారు. ఎంతోమంది అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుని, ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి భూములకు సంబంధించి శాశ్వత పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో భూ భారతి చట్టం తెచ్చామన్నారు.
ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి విజ్ఞప్తులను తీసుకుని వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వలక్ష్యం నెరవేరాలంటే రెవెన్యూ సిబ్బంది మాత్రమే ఆ పని చేయగలరన్నారు. రెవెన్యూ సిబ్బంది రైతాంగానికి రెండు కళ్ల లాంటి వారని, రెవెన్యూ శాఖపైన కొందరు సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. గ్రామాలు, మండలాల్లో ప్రజా దర్బార్లు, రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండని, ఈ చట్టాన్ని గ్రామాలకు తీసుకెళ్లండని ముఖ్యమంత్రి కోరారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణ రంగాల్లో “రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్”

Divitimedia

ప్రజలకోసం సమన్వయంతో పనిచేయాలి

Divitimedia

‘ముక్తార్ పాషా, పైలా చంద్రక్కల అమరత్వం మహోన్నతం’

Divitimedia

Leave a Comment