Divitimedia
Bhadradri KothagudemEntertainmentHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaTravel And Tourism

ముక్కోటిఏకాదశి ఉత్సవాలకు సర్వం సిద్ధం

ముక్కోటిఏకాదశి ఉత్సవాలకు సర్వం సిద్ధం

భక్తులు భద్రాచలానికి తరలిరావాలన్న కలెక్టర్

✍️ భద్రాచలం – దివిటీ (జనవరి 8)

ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా జనవరి 9, 10వ తేదీలలో జరగబోవు తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన ఉత్తర ద్వారదర్శనం ఏర్పాట్లు పరిశీలించారు. ఉత్తర ద్వారం వద్ద సెక్టార్ అధికారులకు తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనం రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 10వ తేదీ తెల్లవారు జామున 3 గంటలకే సెక్టార్ల అధికారులు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. తర్వాత కలెక్టర్, స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ముక్కోటి ఉత్సవాల నిర్వహణ గురించి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈసారి ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో పెద్దఎత్తున భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉత్తరద్వార దర్శనం వద్ద భక్తులను నియంత్రించేందుకు సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. 10వ తేదీన ఉదయం ఐదు గంటలకు స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఉంటుందన్నారు. భద్రాచలం విచ్చేసే భక్తులు శ్రీరాముడిని దర్శించుకోవడంతోపాటు మంచి అనుభూతి కలిగేలా ఏరు పండగను రూపొందించినట్లు తెలిపారు. ‘ఏరు’ అంటే కోయ, తెలుగు భాషలలో నది అనే అర్థం వస్తుందని గోదావరి, తాలిపేరు, కిన్నెరసాని పరివాహక ప్రాంతాల్లో సాంప్రదాయాలు కలిసిన ప్రత్యేకమైన సంస్కృతి మన జిల్లాలో ఉందన్నారు. గిరిజన సంస్కృతి, స్థానిక సాంప్రదాయాలు, ఉత్పత్తులను అందరికీ తెలియపరచడమే ‘ఏరుపండుగ’ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. ఉత్సవాల్లో భాగంగా గోదావరి ఘాట్ వద్ద 9వ తారీకు నుంచి 11వ తారీకు వరకు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, గిరిజన కళాకారుల ద్వారా స్థానిక, గిరిజన నృత్యప్రదర్శనల కోసం అందరూ వీక్షించే విధంగా వేదిక(స్టేజ్)ను రూపొందించినట్లు వివరించారు. కరకట్ట వద్ద 50 స్టాళ్లను ఏర్పాటు చేసి ఆర్గానిక్ నెయ్యి,తదితర అటవీ, గిరిజన ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు తెలిపారు. గోదావరి ఘాట్ వద్ద బోటింగ్ పాయింట్ ఏర్పాటుతో సామాన్యులు సైతం బోటింగ్ అనుభూతి పొందేలా చేశామన్నారు. గోదావరి నది ఒడ్డు పైన ఏర్పాటుచేసిన గుడారాలలో రాత్రి బస పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు.
ఐటీడీఏ ద్వారా గిరిజన మ్యూజియం ఏర్పాటుకు ఐటీడీఏ పీఓ ఎంతగానో కృషి చేశారన్నారు. భద్రాచలం వచ్చిన భక్తులు, పర్యాటకులు రాత్రి బస చేసి మరుసటి రోజు మ్యూజియం, బొజ్జికుప్ప, బెండాలంపాడు ట్రెక్కింగ్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి దీవులను చూడాలనుకున్న వారు కిన్నెరసానిలో పర్యటించాల్సిందిగా కోరారు. ఏర్పాట్లు అన్నింటిని మహిళా సమాఖ్య సభ్యుల ద్వారా ఏర్పాటు చేయడంతో మహిళా సమాఖ్య అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్న ఈ రివర్ ఫెస్టివల్ మార్చి నెల వరకు కొన సాగిస్తామని కలెక్టర్ తెలిపారు. ఉత్తర ద్వారదర్శనానికి విచ్చేసిన భక్తులు ద్వార దర్శనం అనంతరం భారికేడ్లు దాటొద్దని, ప్రశాంతంగా దైవదర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

వాహనానికి మరమ్మత్తులు, రూ.40వేల పరిహారం

Divitimedia

గాడి తప్పిన పాలన… అవుతోంది హేళన…

Divitimedia

అధికారులకు ‘కత్తి మీద సాము’ లా మారుతున్న ఎంపికలు

Divitimedia

Leave a Comment