సగం దోచుకున్నాక… ‘చక్క’బెడుతున్నారు…!
‘ముక్కోటి’ ముందు ‘మొక్కుబడి’ కాకూడదు…!

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జనవరి 7)
ఇంతకాలం ఇష్టారాజ్యంగా సహజ వనరులను యధేచ్ఛగా దోచుకుంటున్న అక్రమార్కులను నిరోధించే ప్రయత్నంలో సాకులు చెప్పిన అధికారులకు ఏమైందో, ఏమో తెలియదుగానీ ఒక్కసారిగా తమ ఉనికి చాటుకుంటున్నారు. నిద్రపోతున్న సింహం ఒక్కసారిగా లేచి జూలు విదిల్చి వేటలోకి వెళ్లిందన్న రేంజిలో అధికారుల చర్యలు హడావుడి సృష్టిస్తున్నాయి. ఈ తతంగమంతా చూస్తున్నవారికి కాస్తంత ఆలోచిస్తే ‘ముక్కోటి ఏకాదశి’ ఉత్సవాలు కళ్లముందు కదిలి ఙ్ఞానోదయమైంది. ఈ హడావుడికి కారణం ముక్కోటి ఉత్సవం కారణమని బోధపడింది. బూర్గంపాడు మండలంలో చాలాకాలం నుంచి అడ్డూ అదుపూ లేకుండా సాగిన ‘ఇసుక అక్రమ రవాణా’కు అడ్డుకట్ట వేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు ఆరంభించింది. ఈ మేరకు బూర్గంపాడు మండలంలో పలు ప్రాంతాల్లో ఇసుక అక్రమరవాణా చేస్తున్న దారులకు అడ్డంగా కందకాలు తవ్వించే పనులు మంగళవారం చేపట్టారు. జిల్లా మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సహా ఆ శాఖ సిబ్బంది, బూర్గంపాడు మండలం రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది కలిసి కందకాల పనిని చేపట్టారు. అధికారులు ముందుగా ఈ మండలం పరిధిలోని పినపాకపట్టీనగర్ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా కోసం ఉపయోగిస్తున్న రహదారికి అడ్డంగా కందకాలు(గోతులు) తవ్వించారు. ఆ తర్వాత ఈ బృందం బుడ్డగూడెంలో కిన్నెరసాని నది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఫిర్యాదులున్న ప్రాంతంలోనూ కందకాలు తవ్వించారు.
———————————————-
మండలంలో యధేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా
———————————————-
బూర్గంపాడు మండలంలో ఇసుక అక్రమ రవాణా కొంతకాలంగా యధేచ్ఛగా సాగి పోతోంది. ఓవైపు గోదావరి, మరోవైపు కిన్నెరసాని ఉండటంతో బూర్గంపాడు మండలం అక్రమార్కులకు ‘స్వర్గధామం’ గా మారింది. ఇతర జిల్లాలేకాక, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అనేక మంది ఇసుక అక్రమ రవాణాకోసం ఈ మండలానికి వస్తున్నారు. వారికి స్థానిక రాజకీయ నాయకులు, బ్రోకర్లు కూడా తోడవుతూ ముఠాలు కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రూ.లక్షల లంచాలకు మరిగి అధికారులు కూడా అక్రమార్కులకు శక్తి మేరకు సహకరిస్తున్నారనేలా దుస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో బూర్గంపాడు మండలం ఇసుక అక్రమ రవాణాకు ప్రధానకేంద్రంగా తయారైంది. ఇక్కడి ఇసుక అక్రమార్కులే జిల్లాలో ఇసుక వ్యాపారాన్ని నియంత్రణ చేసేటంతగా పరిస్థితి దిగజారిపోతోంది. ఈప్రాంతంలో సారపాక, తాళ్లగొమ్మూరు, మోతె, బూర్గంపాడు, సోంపల్లి, పినపాక, ఉప్పుసాక, తదితర ప్రదేశాల్లో భారీగానే అక్రమ ఇసుకర్యాంపులు ఏర్పాటుచేసి మరీ దందా చేస్తున్నారు. బాహాటంగానే సాగిపోతున్న ఈ అక్రమాన్ని అడ్డుకునే బాధ్యత కలిగి ఉన్న రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అడపా దడపా, ఏదో ఒకచోట మొక్కుబడిగా ఇసుక సీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఉన్నతాధికారులంతా భద్రాచలం ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్ల కోసం ఇక్కడే ఉంటుండటంతో తాజాగా చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏదో ఉన్నతాధికారుల కోసమన్నట్లు కాకుండా ఈ ప్రాంతంలో ఇసుక అక్రమార్కుల ఆట కట్టించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బంధీగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇసుక అక్రమ రవాణా నిరోధం కోసం మైనింగ్, రెవెన్యూ, పోలీసుశాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా చర్యలు చేపట్టినట్లు స్థానిక తహసిల్దార్ ముజాహిద్, మంగళవారం ‘దివిటీ మీడియా’కు వివరించారు.