మినిమమ్ వేజెస్ బోర్డు సభ్యుడిగా ‘యారం’ ప్రమాణస్వీకారం
✍️ బూర్గంపాడు - దివిటీ (జనవరి 6)
తెలంగాణ రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి (మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డ్) సభ్యుడిగా సారపాక ఐటీసీ పేపర్ పరిశ్రమలోని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ యారం పిచ్చిరెడ్డి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆ పదవిలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈమేరకు సోమవారం హైదరాబాదులో ఆ సంస్థ చైర్మన్ జనక్ ప్రసాద్ సమక్షంలో యారం పిచ్చిరెడ్డి బోర్డ్ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మిక సంఘాల ప్రతినిధిగా తనపై నమ్మకంతో పదవి అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చైర్మన్ జనక్ ప్రసాద్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారం వెంకటేశ్వర రెడ్డికి ముందుగా ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నానన్నారు. పారిశ్రామిక ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలో రాష్ట్రస్థాయిలో పదవి దక్కడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు. వచ్చిన ఈ అవకాశంతో కార్మికుల పక్షాన నిలబడి హక్కులు సాధించే విధంగా పోరాడుతానన్నారు. త్వరలో జరగబోతున్న ఐటీసీ కార్మిక ఎన్నికలలో ఐఎన్టీయూసీ విజయఢంకా మోగించడం తన ముందున్న లక్ష్యమన్నారు. చైర్మన్ జనక్ ప్రసాద్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చంతో అభినందించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

