అమరారం గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే సమీక్ష


✍️ పినపాక – దివిటీ (జనవరి 7)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్ని శాఖల అధికారులతో గ్రామపంచాయితీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల సమక్షంలోనే అధికారులతో మాట్లాడి ఆ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రభుత్వ గ్యారెంటీ పథకాలు ప్రజలకు చేరుతున్నాయో? లేదో?నని ఆరాతీశారు. ఇబ్బందులేమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. పంచాయతీల్లో నీటి సరఫరా, విద్యుత్తు, ఇరిగేషన్, విద్య, వైద్యం, తదితర శాఖల సమస్యలను అధికారులు వారం లోపల అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని అదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన నిరుపేదలకు అందరికీ ఇప్పించే బాధ్యత తనదన్నారు. ప్రజలకు కష్టం రాకుండా అధికారులతో పనులు చేయిస్తూ ప్రభుత్వం చేపట్టే ప్రతీ పథకం, అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చూసుకునే బాధ్యత తీసుకుంటానని ప్రజలకు హామీనిచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రాలందజేయగా, ఆ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అమరారం గ్రామపంచాయితీ పరిధిలో రూ.20లక్షల అంచనావ్యయంతో నిర్మించిన పలు సీసీ రోడ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఎమ్మెల్యే పినపాక మండలానికి చెందిన 11మంది కల్యాణలక్ష్మి పథకంలోని లబ్ధిదారులకు రూ.11,01276 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబంలో ఆడబిడ్డ పెళ్లి చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణలక్ష్మిపథకంలో ఇస్తున్న డబ్బు జాగ్రత్తగా కుటుంబ అవసరాలకు మాత్రమే వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా, యువజన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:

