ఆషామాషీగా లక్షల రూపాయల ఇసుక వేలం
రూ.2వేల డిపాజిట్ తో రూ.3.1లక్షలకు పాట ఖరారు
నిబంధనలు ప్రకటించకుండానే వేలం నిర్వహణ
✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 23)
లక్షల రూపాయల విలువైన ఇసుక వేలం విషయంలో అధికారుల వ్యవహారశైలిపై విస్తుపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వేలంలో రూ.3లక్షలపైగా విలువ పలికిన ఇసుకవేలంపాటలో పాల్గొన్నవారి నుంచి తీసుకున్న డిపాజిట్ కేవలం రూ.2,000. ఆదినుంచీ అనుమానాలు, వివాదాలకు కేంద్రబింధువుగా ఉన్న సారపాక ఇసుక పట్టివేత వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే బూర్గంపాడు రెవెన్యూ అధికారులతీరు అర్థంకాకుండా ఉంది. సారపాకలో ఇసుక సీజ్ చేసిన దగ్గర నుంచి తాజాగా సోమవారం వేలం నిర్వహించే వరకు పలు ఆశ్చర్యకరమైన, అనుమానాస్పద పరిస్థితులేర్పడ్డాయి. ఈ వేలం వ్యవహారంపై ‘దివిటీ మీడియా’ ప్రత్యేక కథనమిది…
బూర్గంపాడు మండలం సారపాకలో ప్రముఖ పేపర్ పరిశ్రమ ఐటీసీ- పీఎస్పీడీ సంస్థకు చెందిన స్థలంలో ఇసుక నిల్వలు భారీగా గుర్తించి, సీజ్ చేసినట్లు రెవెన్యూ శాఖాధికారులు ప్రకటించారు. డిసెంబరు 2వ తేదీన ఇసుక సీజ్ చేసినట్లు చెప్పిన అధికారులు ఆ వివరాలు అధికారికంగా ప్రకటించకపోవడం విశేషం. అసలక్కడ స్వాధీనమైన ఇసుక పరిమాణం ఎంత?, ఎవరి నుంచి స్వాధీనం చేసుకున్నారు?, ఎందుకు ఇసుక స్వాధీనంచేసుకోవాల్సి వచ్చింది? అనే వివరాలు వెల్లడించలేదు. ఈ ఇసుక స్వాధీనం చేసుకున్న తర్వాత దాదాపు 20రోజులకు ఇసుక వేలంపాట నిర్వహణకు సమయం ప్రకటించారు. ఆ తర్వాత ఎందుకనో నిర్వహించనేలేదు. మళ్లీ తాజాగా ఇసుక వేలం నిర్వహణపై ‘వాట్సాప్ గ్రూపు’లోనే ప్రకటించారు. ఆ ప్రకటనలో కూడా ఇసుకకు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించనేలేదు. ఆ వివరాల గురించి పక్కనపెడితే, కనీసం ఇసుక వేలంపాటలో పాల్గొనాలంటే ఏఏ అర్హతలుండాలి? నిబంధనలేంటి? కనీస డిపాజిట్ (దరావత్తు సొమ్ము) ఎంత? వంటి వివరాలతోపాటు ఇతర వివరాలు ఏవీ ప్రకటించలేదు. స్థానికసంస్థల్లో చిన్న చిన్న వేలంపాటల్లో కూడా ప్రత్యేకమైన నిబంధనలతో కూడిన ప్రకటన ముందే జారీ చేస్తారు. కానీ రూ.లక్షల విలువగల భారీపరిమాణంలో ఇసుక వేలంపాటలో అంతా ఓ ప్రైవేటు వ్యవహారంలా సాగిన తీరు విస్మయం కలిగిస్తోంది. వేలంపాట పూర్తయినట్లు చెప్తున్న తహసిల్దారు, ఆ వివరాలు కూడా అధికారికంగా ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఆ తహసిల్దారు కూడా ఉన్న ఓ ‘ వాట్సాప్ గ్రూపు’ లో ఓ వీఏఓతో ప్రకటింపజేశారు. ఆ ప్రకటనలో కూడా వివరాలే లేకుండా తూతూమంత్రంగా ఉండటం విశేషం. ఈ వ్యవహారమంతా చూస్తుంటే అధికారిక వేలంపాటలో పాటించాల్సిన పద్ధతులు, నిబంధనలను విస్మరించిన తీరు పలు అనుమానాలకు దారితీస్తోంది. మొత్తం ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి, లోపాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.
————————
అవసరమైతే వేలంపాట మళ్లీ నిర్వహిస్తాం : బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్…
————————
నాకు ఆరోగ్య సమస్యల వల్ల అవకాశం ఉన్నంతవరకు, మాకు తెలిసినంతవరకు వేలంపాట నిర్వహించాం. రూ.3లక్షలకు పైగా పాడుకున్నారు. డిపాజిట్ రూ.2 వేలు తీసుకున్నాం. ఏదైనా తేడా వస్తే మళ్లీ వేలంపాట నిర్వహిస్తాం.