‘బలగం’ సింగర్ మొగిలయ్య మృతి
సంతాపం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
✍️ వరంగల్ – దివిటీ (డిసెంబర్ 19)
తెలంగాణ జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య గురువారం మృతిచెందారు. ఆయన పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు ప్రాచుర్యం కల్పించి, కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య, ‘బలగం’ సినిమాలో పాట తో తెలుగువారందరికీ చిరపరిచితులు అయ్యారు. ఆయన మరణం బడుగుల సంగీత, సాహిత్యరంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా దుగ్గొడి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య ‘శారదతంబుర’అనే వాయిద్యం మీటుతుంటే పక్కనే ఆయన సతీమణి కొమురమ్మ బుర్ర(డక్కీ అనేది) వాయిస్తూ పలుచోట్ల ప్రదర్శనలిచ్చారు. మొగిలయ్య-కొమురమ్మ దంపతులిచ్చిన ప్రదర్శనలు వెలకట్టలేనివని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టి “బలగం” సినిమా చివర్లో మొగిలయ్య పాడిన పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఈ బాధాకర సమయంలో పస్తం మొగిలయ్య సతీమణి కొమురమ్మ తోపాటు వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు