సమాజంలోని ప్రతి ఒక్కరికీ అభినృద్ధి ఫలాలు దక్కాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర గవర్నర్ పర్యటన
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (అక్టోబరు 25)
అభివృద్ధిఫలాలు ప్రతి ఒక్కరికీ అందాలని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేద గిరిజనులకు మెరుగైన జీవితాలనందించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం అయన భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించారు. భద్రాద్రి శ్రీరామచంద్రుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్, కలెక్టరేట్ లో జిల్లా అధికారులు, కళాకారులు, రచయితలు, ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం సాయంత్రమే జిల్లాకు వచ్చిన గవర్నర్ సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్ లో బసచేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రామసహాయం రఘురామిరెడ్డి, బలరాంనాయక్, పినపాక, కొత్తగూడెం, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఎస్పీ రోహిత్ రాజు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
రాష్ట్ర గవర్నర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ ఆవరణలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ జిల్లా అధికారులు, ప్రముఖులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి.వి.పాటిల్ జిల్లా ప్రాముఖ్యత, సంస్కృతి, సంప్రదాయాలు, వివిధశాఖల ద్వారా అమలు చేస్తున్న ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు తెలియ జేశారు. గవర్నర్ విష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు. ముఖ్యంగా 2021లో 73 శాతం ఉన్న రక్తహీనత 2024 నాటికి 21 శాతానికి తీసుకురావడం అభినందనీయమని, దీనిపై జిల్లాయంత్రాంగం తీసుకున్న చర్యల పూర్తి వివరాలను సమర్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలలో, ఇతర ఆదివాసీ గ్రామాల్లోని గిరిజన ప్రజల్లో రక్తహీనత నివారించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛభారత్ లో భాగంగా జిల్లాలో ఉన్న
481 గ్రామపంచాయతీలు బహిరంగ మలమూత్ర విసర్జనరహిత గ్రామాలుగా ప్రకటించడం సంతోషమని, స్వచ్ఛభారత్ కార్యక్రమం కాదని, ఇదొక ఉద్యమమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు, గిరిజన కుటుంబాలను భాగస్వామ్యం చేయాలని, ప్రత్యేకించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రజలను దారిద్రరేఖ నుంచి పైకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, రచయితలు, కళాకారులు అందర్నీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వయం సహాయక మహిళాసంఘాల కార్యక్రమాలు, ఆదివాసీ గిరిజన మహిళలు తయారు చేసిన వంటకాలు చాలా బాగున్నాయని, భవిష్యత్తు అభివృద్ధి మహిళా సాధికారత పై ఆధారపడి ఉందని, ఈ విషయం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన సందర్భంగా గిరిజన మహిళలు తయారు చేసిన చేతి వృత్తుల ప్రదర్శన, వంటకాలలో తాను గుర్తించానని చెప్పారు. స్వయంశక్తితో ఉపాధి కల్పించుకుని విజయాలు సాధించిన గిరిజన మహిళల గురించి సమాజానికి తెలియజేయాలని, ఇతరులు వారిని స్ఫూర్తిగా పొంది అభివృద్ధి చెందుతారన్నారు. మహిళల చేతుల్లో డబ్బున్నప్పుడు ఆర్థిక సాధికారత వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న జీవన పరిస్థితుల మెరుగుదల కోసం కృషిచేయడం చాలా ముఖ్యమని, సమాజంలో ఉన్న చిట్టచివరి మనిషి వరకు అభివృద్ధి ఫలాలు చేరాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ సాధ్యమన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్య, వైద్య,ఆరోగ్య రంగాలను పరిశీలిస్తే మెరుగైన స్థానంలో ఉన్నాయని, ప్రత్యేకించి 2024లో పదో తరగతిలో 90.6శాతం, గిరిజన సంక్షేమశాఖ కృషితో గిరిజన విద్యార్థులు పదో తరగతిలో 92శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు తరగతి గదుల్లో విద్యతోపాటు, చిన్న చిన్న చేతివృత్తులకు సంబంధించిన వస్తువుల తయారీ, చిన్న చిన్న పరికరాల వంటివి రూపొందించడం తెలియజేస్తే వారు ఇంకా విజ్ఞానవంతులు కావడానికి అవకాశం ఉందని అన్నారు. ప్రతి విషయం ప్రజలకు తెలియజేయడం ద్వారా వారు ఎక్కువ జ్ఞానాన్ని పొందేందుకు ఆస్కారం ఉందన్నారు. 2047 నాటికి ఇండియా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి వికసిత్ భారత్ కావాలని ఆయన ఆకాంక్షించారు. సమాజమంటే సంపద కాదని, సమాజం అంటే సంస్కృతి అని గవర్నర్ చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నదులు, అటవీ సంపద, బీపీఎల్, కేటీపీఎస్, జెన్కో, భారజల కర్మాగారం, సింగరేణి గనులు ఉన్నాయని, నిరుద్యోగులైన అన్ని వర్గాల యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తే వారంతా జీవనోపాధి పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. భద్రాచలం, పర్ణశాలలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయాల పరంగా పర్యాటక శాఖను అభివృద్ధి చేసుకుని ఉపాధి అవకాశాలు కల్పించుకోవచ్చని సూచించారు. విద్య, ఆరోగ్యం, కల్చరల్, వ్యవసాయం, ఉపాధి అవకాశాల్లో జిల్లాల మధ్య పోటీతత్వముంటే అభివృద్ధి తప్పకుండా సాధ్యమవుతుందని వివరించారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలలో నివసిస్తున్న మారుమూల ప్రాంత కొండరెడ్ల విషయంలో అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకుని వారి కుటుంబాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. జిల్లాలో ఏజెన్సీప్రాంత గిరిజన రైతులే కాకుండా ఇతర రైతులు కాలానుగుణంగా పంటలు పండించుకుని వృద్ధి లోకి రావాలని అన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడుతున్న అధికారులు ప్రధానంగా గిరిజన గ్రామాలలో కావలసిన మౌలిక సదుపాయాలు, విద్యా, వైద్యం, వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే గిరిజనులు తప్పనిసరిగా అభివృద్ధిలోకొస్తారన్నారు. జిల్లాలో ప్రతి గ్రామంలో వైద్యశాలలు బాగా పనిచేయాలని, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను సక్రమంగా నడిచే విధంగా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో స్వచ్ఛమైన తాగునీరు సరఫరా కావాలని అన్నారు. జిల్లా అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ వివరించిన విధానం బాగుందంటూ గవర్నర్ అభినందించారు. జిల్లాలోని ముఖ్యమైన దేవాలయాలు, పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్యం ,విద్య, వ్యవసాయం, ఉద్యానవనం, సంక్షేమం ,నీటిపారుదల, విద్యుత్, పౌర సరఫరాలు, గిరిజన సంక్షేమం, తదితర ముఖ్యమైన శాఖల ద్వారా అమలుచేస్తున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ తెలియజేశారు.
వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో అవార్డులను సాధించిన పలువురు ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు వారి వారి రంగాల్లో చేసిన కృషిని రాష్ట్ర గవర్నర్ తో పంచుకున్నారు.
డాక్టర్ ప్రభుదయాల్ రచయిత, సీతాప్రసాద్ క్లాసికల్ డాన్సర్, వెంకటయ్య ఔషధమొక్కల పెంపకం, కొండా విజయ్ కుమార్ సినిమా దర్శకుడు, ఎన్ రాజశేఖర్ ఉత్తమ తోటయజమాని, పసుల అంజన్ కుమార్ ఆర్టిస్ట్, ఉయికే వెంకటలక్ష్మి శానిటరీ నాప్కిన్, మిల్లెట్ తయారీ యజమాని, మోడం వంశీ పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడలిస్ట్, ఎ.శంకర్ గాయకుడు, వి.కొండలరావు గాయకుడు, డాక్టర్ బుచ్చయ్య గాయకుడు, టి.శ్రీతేజ నేషనల్ అథ్లెటిక్ బ్రాంజ్ మెడల్ విజేత, బట్టు శ్వేత వెయిట్ లిఫ్టింగ్, శ్రీరామ్ శెట్టి కాంతారావు పద్య రచయిత, ఆంగోతి శ్రీనివాసరావు పద్య రచయిత, పి రోశయ్యచౌదరి గాయకుడు, వెంగళ భాస్కర్ పాటల రచయిత, బి.రిత్వికశ్రీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఎస్. సీత రచయిత్రి,కవి, స్నేహ జానపద గాయని, ఎస్ ప్రభాకరాచార్యులు రచయిత, కవి, కె.దుర్గాచారి రచయిత, కవి, తురిమెళ్ళ కళ్యాణి రచయిత, కవి, ఎస్.కృష్ణమూర్తి రచయిత, నాగరాజశేఖర్ రచయిత, జిల్లా అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా తరఫున గవర్నర్ విష్ణుదేవ్ వర్మను కవులు, రచయితలు శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకటేష్ శ్యామ్, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణగౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీఓలు మధు, దామోదర్ రావు, పలువురు జిల్లా అధికారులు, ఐటిడిఏ అధికారులు కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రెండు రోజుల పర్యటన విజయవంతమవ్వడానికి కృషిచేసిన జిల్లా, ఐటీడీఏ అధికారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ అభినందనలు తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో గవర్నర్ సమావేశానంతరం ప్రముఖులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు, డాక్టర్లు, అడ్వకేట్లు, అవార్డుగ్రహీతలతో జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ మాట్లాడారు.