Divitimedia
Bhadradri KothagudemEducationHealthHyderabadLife StyleSpecial ArticlesTelanganaWomen

అబ్బే… అక్రమాలకు తావే లేదన్నారు…

అబ్బే… అక్రమాలకు తావే లేదన్నారు…

పదే పదే… అదే కానిచ్చేస్తున్నారు…

అభాసుపాలవుతున్నా… ఐసీడీఎస్ లో మారనితీరు

✍️ హైదరాబాద్ – దివిటీ (ఆగస్టు 24)

‘అబ్బబ్బే… మా దగ్గర అక్రమాలకు తావే లేదండీ…’ అంటూ ఉన్నతాధికారులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ ఐసీడీఎస్ విభాగంలో అక్రమాలు పరాకాష్టకు చేరాయి. ఓ స్పష్టతంటూ లేకుండా ఇష్టం వచ్చినట్లు డెప్యుటేషన్లు ఇచ్చేస్తున్న వ్యవహారాలను ఇటీవల ‘దివిటీ మీడియా’ వెలుగులోకి తేవడంతో కంగుతిన్న ఉన్నతాధికారులు, అసలు డెప్యుటేషన్లే ఇవ్వకుండా మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తున్నట్లుగా నమ్మబలికారు. వ్యవహారం కాస్త చల్లబడిన తర్వాత మళ్లీ యధాప్రకారం కానిచ్చేస్తున్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే, ఇంత ఘోరంగా అక్రమంగా డెప్యుటేషన్లు ఇవ్వడం వెనుక జరుగుతున్న తతంగం ఏమిటనేది సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఏ ప్రయోజనాలు ఆశించి ఉన్నతాధికారులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలే ఐసీడీఎస్ లో వివాదాలకు నెలవనే పేరున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజాగా రాష్ట్ర ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం ఒకటి తీవ్ర వివాదాస్పదమవుతోంది. బూర్గంపాడు ప్రాజెక్టులో సీడీపీఓగా సేవలందించిన ప్రమీల సెప్టెంబరు 11నుంచి ఉద్యోగోన్నతిపై అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్లిపోయారు. ఆ పోస్టు ఖాళీ అయిన నేపథ్యంలో అదే ప్రాజెక్టులో ఏసీడీపీఓగా పనిచేస్తున్న రేవతికి సీడీపీఓ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. ఆ ప్రక్రియలో కొన్ని కారణాలతో తీవ్రమైన జాప్యం కూడా జరిగింది. ఈ పరిస్థితులలోనే సిరిసిల్లలో ఏసీడీపీఓగా పనిచేస్తున్న వి.జ్యోతిని బూర్గంపాడు ప్రాజెక్టుకు డెప్యుటేషన్ మీద పంపిస్తూ, ఆమెకు సీడీపీఓ హోదా కట్టబెట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో మహిళా, శిశు సంక్షేమశాఖ
రాష్ట్ర డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాల వెనుక ఓ అధికారి ‘చక్రం తిప్పినట్లు’ తెలుస్తోంది. అసలు సమస్యే లేని ప్రాజెక్టుకు ఇతర ప్రాంతాల నుంచి అధికారిని డెప్యుటేషన్ మీద పంపించడమే దారుణమనుకుంటే, అసలు రెగ్యులర్ ఏసీడీపీఓను పక్కన పెట్టి మరీ ఆమెకు జూనియర్ గా ఉన్న డెప్యుటేషన్ ఏసీడీపీఓకు, సీడీపీఓ బాధ్యతలు కట్టబెట్టడం వెనుక ఎంతటి తతంగం నడిచిందోననే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అసలే ఇటీవల బదిలీల ప్రక్రియ ముగిసిన వెంటనే ‘డెప్యుటేషన్ల’ పేరిట కొందరు అధికారులు భారీగా అక్రమ వసూళ్లకు తెర లేపారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాలను వెలుగులోకి తెస్తూ “దివిటీ మీడియా”లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించడంతో ఉన్నతాధికారులు పునరాలోచనలో పడ్డారు. డబ్బుల వసూళ్ల వ్యవహారం మీద వెల్లువెత్తిన ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో అసలు ‘డెప్యుటేషన్ల జోలికే పోయేది లేదంటూ’ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ సునంద స్పష్టం చేశారు. ఇంత వివాదం జరిగిన తర్వాత కూడా ఉన్నతాధికారులు మళ్లీ అదేబాటలో మరింత తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం వెనుక పైరవీలు, ముడుపుల వ్యవహారాలు కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐసీడీఎస్ లో వసూళ్లకు అలవాటుపడిన ఓ అధికారి, రాష్ట్రస్థాయిలో తనకున్న పలుకుబడిని అడ్డంపెట్టుకుని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తీవ్రమైన వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి అక్రమాలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి…
————————-
డెప్యుటేషన్ వ్యవహారంలో జరిగిన పొరపాట్లను రాష్ట్ర డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తా : జాయింట్ డైరెక్టర్ సునంద
————————-
బూర్గంపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టులో రెగ్యులర్ ఏసీడీపీఓ ఉండగా వేరే ప్రాంతం నుంచి డెప్యుటేషన్ మీద పంపిన ఏసీడీపీఓకు ‘సీడీపీఓ’ బాధ్యతలు అప్పగించిన వ్యవహారంలో ఏర్పడిన పరిస్థితులను తమ శాఖ రాష్ట్ర డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని జాయింట్ డైరెక్టర్ సునంద, ‘దివిటీ మీడియా’కు వివరించారు. పొరపాటు జరిగినదానిపై సమీక్షించి, సరిదిద్దుతామని ఆమె హామీ ఇచ్చారు.

Related posts

ఎన్నికల సమాచారం మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలి

Divitimedia

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు

Divitimedia

చ‌త్తీస్‌గ‌ఢ్, తెలంగాణాల‌లో అక్టోబ‌ర్ 3న ప్ర‌ధానమంత్రి ప‌ర్య‌టన

Divitimedia

Leave a Comment