ప్రాణాలు పోయినా ఫర్వాలేదా… ?
నేషనల్ హైవే నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం…
ఒక్క ప్రాణం పోయినా బాధ్యత ఎవరిది మరి…
✍️ కామిరెడ్డి నాగిరెడ్డి – దివిటీ (సెప్టెంబరు 19)
“కడుపులో చల్ల కదలకుండా” నెలనెలా జీతం – గీతం లక్షల రూపాయల్లో వస్తుంటే, ఆ అధికారులకు ప్రాణం విలువ అర్థం కావడం లేదు. విధులలో తమ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణం పోయేందుకు కారణమైతే ఆ ప్రాణాన్ని తిరిగి తెచ్చివ్వగలమా? అన్న ఆలోచనే లేనట్టుంది వారికి… అందుకే తమ బాధ్యత మరిచి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో నేషనల్ హైవే -30 దుస్థితి చూస్తున్నవారికెవరికైనా ఈ అధికారుల బాధ్యతారాహిత్యం కళ్లముందు కనపడి వెక్కిరిస్తోంది…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేషనల్ హైవే -30 లో లోపాలు, నిర్వహణ పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. రామవరం నుంచి కొత్తగూడెం మీదుగా భద్రాచలం వరకు ప్రమాదకరంగా మారింది. రామవరం నుంచి కొత్తగూడెం వరకు, కొత్తగూడెం నుంచి వైద్య కళాశాల క్రాస్ రోడ్ వరకు రాత్రివేళ కనీసం రోడ్డు మార్జిన్ తెలిసే విధంగా తెల్లగీతలు లేకపోవడం దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది. రాత్రి సమయంలో ఎదురెదురుగా వాహనాలు వెళ్తున్నప్పుడు డ్రైవర్లకు రోడ్డు మధ్యలో డివైడర్లు కూడా కనిపించడం లేదు. అలా కనిపించేలా డివైడర్లకు పెయింట్ వేయడం కూడా మర్చిపోయారు. ఈ హైవేలో రోడ్డు మార్జిన్స్ కనిపించేలా వేయాల్సిన మార్కింగ్స్ కూడా చాలా చోట్ల లేకపోవడంతో కూడా ప్రమాదాలకు అవకాశం కల్పిస్తోంది. పాల్వంచ దాటిన తర్వాత బూర్గంపాడు మండలంలో నేషనల్ హైవేలో పరిస్థితులు మరింత ఘోరంగా మారాయి. పెద్ద పెద్ద గోతులతో, డివైడర్లు, మార్కింగ్స్ లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ప్రమాదాలకు ఆస్కారం పెరిగిపోతోందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు మోరంపల్లిబంజర సెంటర్ వద్ద రోడ్డు మధ్యలో కుంగి పోయి, మోటారుసైకిళ్లు, ఆటోల వంటి వాహనాలు అదుపుతప్పి అటూఇటూ జారిపోతున్నాయి. చాలా కాలంపాటు ఎవరూ ఈ లోపాన్ని పట్టించుకోలేదు. ఈ దుస్థితి గురించి ఇటీవల “దివిటీ మీడియా”లో సచిత్ర కథనం ప్రచురించడంతో కాస్త కదలిక వచ్చింది. కానీ కుంగిపోయిన రోడ్డుకు మరమ్మతులు చేసే క్రమంలో ఎంతో నిర్లక్ష్యధోరణి కనిపిస్తోంది. పైపైన తారు కలిపిన కంకరమిక్స్ కాస్త పోసి, తూతూమంత్రంగా చేసేశారు. ఆ తారు మిక్స్ కాస్తా ఎందుకూ పనికిరాకపోగా, మరింత ప్రమాదకరంగా మారింది. ఇంక బూర్గంపాడు మండలం పరిధిలోని ముసలిమడుగు, పోలవరం బ్రిడ్జిల దగ్గర గోతులు, ఇరుకు, మార్జిన్స్ కూడా కనిపించకపోవడం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాస్త హడావుడి చేయడంతో తూతూమంత్రంగా, కంటి తుడుపు చర్యలతో సరిపెట్టారే తప్ప శాశ్వతమైన దిద్దుబాటు చర్యలు మాత్రం తీసుకోనేలేదు. ఇంతటి దారుణమైన ప్రమాదకర పరిస్థితులను చక్కదిద్దేలా జిల్లా కలెక్టర్ చొరవతో, నేషనల్ హైవేస్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాల గురించి వివరణ కోసం “దివిటీ మీడియా”, నేషనల్ హైవే అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులో లేరు.