సీజనులో చిచ్చురేపిన సమన్వయలోపం…
దిగజారుతున్న మోరంపల్లిబంజర పి.హెచ్.సి
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 29)
ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకుంటూ రోగులకు సేవలందించాల్సిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయలోపంతో వీధికెక్కారు. ఎవరెవరు ఏఏ పనులు చేయాలన్న విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ ఇక్కడ సిబ్బందికి, అధికారులకు నడుమ సమన్వయం లేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎవరిపని వారు చేయాలన్న ఆలోచన ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిలో కొరవడుతోంది. ఫలితంగా ఓ రేంజిలో గొడవలు జరుగుతున్నాయి. సరిగ్గా వ్యాధుల సీజనులో రేగిన చిచ్చు కారణంగా రోగులకు సేవలపై పెనుప్రభావం పడుతోంది. ఇరవై నాలుగు గంటలపాటు సేవలందించాల్సిన మోరంపల్లిబంజర పి.హెచ్.సి.లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపాలను బట్టబయలు చేస్తున్నాయి.
——————–
వ్యాధుల సీజనులో రచ్చకెక్కిన విభేధాలు
——————–
ఓవైపు పేద ప్రజలు వ్యాధులతో విలవిలలాడుతుంటే మరోవైపు అధికారులు, సిబ్బంది నడుమ రచ్చకెక్కిన విభేదాలతో మోరంపల్లిబంజర ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో సేవలు దిగజారుతున్నాయి. ఇరవై నాలుగు గంటలూ సేవలందించాల్సిన ఈ పి.హెచ్.సి.లో ఇద్దరు వైద్యాధికారులుండగా, ఓ వైద్యాధికారిని డీఎంహెచ్ఓ కార్యాలయానికే పరిమితమయ్యారు. ఆమెకు జిల్లాలో మలేరియా నిర్మూలన కార్యక్రమం పర్యవేక్షణ బాధ్యత అప్పగించడంతో ఆమె పి.హెచ్.సి. ముఖమే చూడటం లేదు. ఉన్న ఒక్క వైద్యాధికారి కూడా హెడ్ క్వార్టర్స్ లో ఉండకుండా రాకపోకలు సాగిస్తుండటంతో పర్యవేక్షణ కొరవడుతోంది. వైద్యాధికారే హెడ్ క్వార్టర్స్ లో ఉండక పోవడంతో పర్యవేక్షక సిబ్బంది, ఎం.ఎల్.హెచ్.పిలు, ఏఎన్ఎంలలో అనేకమంది తమ విధులకు ఆలస్యంగా వస్తున్న దుస్థితి నెలకొంది. పలువురు సిబ్బంది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, మణుగూరు వంటి దూర ప్రాంతాల నుంచి విధులకు వచ్చి వెళ్తున్నారంటే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 13 సబ్ సెంటర్లలో 11మంది ఏఎన్ఎంలు, 13 మంది సెకండ్ ఏఎన్ఎంలు, 49మంది ఆశా కార్యకర్తల సేవలతో మంచిపేరు తెచ్చుకోవాల్సిన పి.హెచ్.సిలో సమన్వయలోపం, విభేదాలతో పరిస్థితి ఘోరంగా దిగజారుతోంది. వైద్యాధికారుల వైఫల్యంతో పాటు, పర్యవేక్షణ సిబ్బంది కొందరు చేసే మితిమీరిన పెత్తనం కూడా సిబ్బందిలో వ్యతిరేకతకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మోరంపల్లిబంజర పి.హెచ్.సి పరిధిలో పనిచేస్తున్న ఆశాకార్యకర్తలు తమ మీద వైద్యాధికారి, హెచ్ఈఓల వేధింపులు ఆపాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సంఘటన మోరంపల్లిబంజర పి.హెచ్.సిలో చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితులను వెల్లడి చేసింది. అంతర్గతంగా నలుగుతున్న ఘర్షణల పరిస్థితులను వెలుగులోకి తెచ్చింది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మోరంపల్లిబంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరుగుతున్న పరిణామాలను పూర్తిగా విచారించి, బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, పరిస్థితులు చక్కదిద్దకపోతే మరింతగా దిగజారిపోయి ప్రజారోగ్యంపై పెను ప్రభావం పడే అవకాశాలున్నాయి.