తనభర్తతో చనువుగా ఉంటోందని మహిళను నరికిన భార్య
✍️ కొత్తగూడెం – దివిటీ (జులై 5)
తన భర్తతో వేరే మహిళ తరచుగా ఫోన్ మాట్లాడుతూ చనువుగా ఉంటుండటం సహించలేక అతని భార్య ఆ మహిళను కత్తితో నరికిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం సమీపంలోని రుద్రంపూర్ లో శుక్రవారం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రుద్రంపూర్ లో నివసించే చాపలమడుగు శిరీష అనే మహిళ తన ఇంటిలో తన పిల్లలతో కలిసి ఉండగా గురువారం మధ్యాహ్నం మరో మహిళ తలకు ముసుగు ధరించి వచ్చింది. ఆ మహిళ కత్తితో శిరీషపై దాడిచేసి పారిపోవడంతో ఆమె తీవ్రంగా గాయాల పాలయ్యారు. చుట్టుపక్కల వారు ఆమెను కాపాడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై ఆమె భర్త శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు గురువారం కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్లో 109, 333 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం హత్యాయత్నం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలు తన చిన్ననాటి మిత్రుడైన దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో తరచుగా ఫోన్ మాట్లాడుతూ చనువుగా ఉంటుందని అతని భార్య పావని అనుమానం పెంచుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఏవిధంగానైనా శిరీషను అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎవరూ లేని సమయం చూసి నిందితురాలు పావని శిరీషను అంతమొందించాలని కత్తి తీసుకుని వచ్చి శిరీష మీద విచక్షణారహితంగా దాడి చేయగా, శిరీషకు తల పైన, మెడభాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు నిందితురాలు పొట్లూరి పావనిని గుర్తించి, శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లుగా వెల్లడించారు.