పినపాకలో పాయం అఖండ విజయం…
అనూహ్యంగా ‘రెట్టింపు’ మెజారిటీతో సంచలనం
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
ఆదినుంచీ ఉన్న ఆనవాయితీలన్నీ మారిపోయాయి… వెనకాముందూ ఆలోచన లేకుండా ఓటర్లు ఏకపక్షంగా మద్దతు ప్రకటించారు… పోలింగ్ రోజుకు ముందే ‘డిసైడ్’ అయిన ప్రజలు అదే అమలు చేశారు… ఫలితంగా పినపాకలో పాయం వెంకటేశ్వర్లు అఖండ విజయం సాధించారు. ఇక్కడి ఆనవాయితీలన్నీ పక్కన పెట్టి మరీ ప్రజలు ఆయనకు భారీ మెజారిటీ కట్టబెట్టారు… రాష్ట్రంలో ప్రముఖ నియోజకవర్గాలతో సమానంగా ఉత్కంఠ రేపిన పినపాక నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ లేనంతగా అద్భుత విజయాన్నందించారు. విజేత పాయం వెంకటేశ్వర్లుకు 34,506 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సొంతమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు 90,510 ఓట్లు సొంతం చేసుకోగా, ఆయన ప్రత్యర్థి ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుకు 56,004 ఓట్లు దక్కాయి. 2014లో తొలిసారి పినపాక నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ వాదం గట్టిగా మార్మోగిపోతోంది. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు 14,065 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, ఆయన సమీప ప్రత్యర్థులుగా టీఆర్ఎస్ అభ్యర్థిగా నూనావత్ శంకర్ నాయక్ 28,410 ఓట్లు, బీజేపీ అభ్యర్థి చందా లింగయ్య 28,195 ఓట్లు దక్కించుకున్నారు. ఆ తర్వాత పాయం వెంకటేశ్వర్లు అధికార బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించగా, రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేగా కాంతారావు 19,565 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడు కాంతారావుకు 72,283 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు 52,718 ఓట్లు దక్కాయి. ఆ తర్వాత పాయం వెంకటేశ్వర్లు రాజకీయంగా కాస్త సైలెంట్ అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా కాంతారావు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించారు. ప్రస్తుతం ఎన్నికలకు ముందు తన నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన పాయం వెంకటేశ్వర్లు మరోసారి ప్రజల ఆశీర్వాదంతో అఖండ విజయం సాధించారు.
——————————
రేగా కాంతారావును దెబ్బతీసిన అతి విశ్వాసం…
——————————
అభివృద్ధి కోసం అధికారపార్టీలో చేరినట్లు ప్రకటించుకున్న రేగా కాంతారావు ప్రభుత్వవిప్ హోదాలో అభివృద్ధి చేసిన విషయం విస్మరించలేనిదే అయినప్పటికీ, అతి ఆత్మ విశ్వాసంతో ఆయన వ్యవహరించిన తీరు నియోజకవర్గ ప్రజలకు నచ్చలేదు. ఆయన చుట్టూ చేరి, కేవలం తమ స్వలాభం కోసం కొందరు నాయకులు చేసిన పనులు ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని చెప్పవచ్చు. అధికార పార్టీ ముసుగులో తన అనుచరులు చేసిన ‘ఇసుక, మట్టి అక్రమ రవాణా’, భూకబ్జాల లాంటి దందాలకు కూడా కాంతారావు అడ్డుచెప్పలేకపోగా, అండదండలు కూడా అందించారనే కోపం ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకతకు కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో తన అనుచరులు కొడుతున్న డబ్బా మత్తులో రేగా కాంతారావు ప్రజా వ్యతిరేకతను గుర్తించలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. రేగా కాంతారావు పైనున్న వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైనున్న అభిమానం పాయం వెంకటేశ్వర్లు విజయానికి బాగా కలిసి వచ్చింది. అఖండ విజయాన్ని అందించింది. గతంలో తన ఓటమికి, ప్రస్తుతం తన ప్రత్యర్థి రేగా ఓటమికి దారితీసిన కారణాలు, పరిస్థితులను గుర్తించుకుంటూ ముందుకు సాగితే పాయం వెంకటేశ్వర్లు ఈ నియోజకవర్గంలో శాశ్వతంగా పాగా వేసే అవకాశం ఉంది. రేగా కాంతారావు ఓటమికి కారకులైన నాయకులే మళ్లీ తన చుట్టూ చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆయనపైనే ఉంది. కిందిస్థాయిలో రేగా కోసం పనిచేసిన కొందరు కిందిస్థాయి నాయకులు పాయం వెంకటేశ్వర్లు విజయానికి తాము కూడా కృషి చేశామని చాటుకునే ప్రయత్నంలో పడటం గమనార్హం.
కనీస ప్రభావం చూపలేని ఇతర పార్టీలు, స్వతంత్రులు
——————————-
పినపాక నియోజకవర్గంలో ముఖాముఖీ పోరులో ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కనీస ప్రభావం కూడా చూపించలేకపోయారు. ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు నామమాత్రంగా ఓట్లు పడ్డాయి. అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీ కూడా ఇక్కడ కనీస ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. అభ్యర్థి కొత్త వ్యక్తి కావడం, స్థానిక నాయకత్వం ఆయనకు కనీస సహకారం కూడా అందించకపోవడంతో మూడోస్థానంలోని బీజేపీ అభ్యర్థి పొడియం బాలరాజుకు కూడా కేవలం 2,627 ఓట్లు దక్కడం గమనార్హం. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చందా లింగయ్యకు రికార్డు స్థాయిలో ఏకంగా 28,195 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆయన తనయుడు చందా సంతోష్ కుమార్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సందర్భంలో కూడా కేవలం 2,292 ఓట్లు దక్కాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ పెంచుకున్న ఓట్లు కేవలం 335. ఇంక సామాజిక మార్పు నినాదంతో బరిలోకి దిగిన బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేసిన వజ్జా శ్యామ్ కు దక్కిన ఓట్లు కేవలం 719. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థులు పాల్వంచ దుర్గ (2,167 ఓట్లు), పూనెం రాజేష్ (1,998 ఓట్లు), బానోత్ జగ్గారావు (1,429 ఓట్లు), వాసం మంగయ్య (1,028 ఓట్లు) కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ 11 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులకు నోటా (905 ఓట్లు) కంటే తక్కువ ఓట్లు పడ్డాయి.