వాహనాల తనిఖీలపై ప్రత్యేక డ్రైవ్
✍️ దివిటీ మీడియా
రోడ్డుభద్రత, ట్రాఫిక్ నిబంధనల అమల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు బుధవారం ప్రత్యేక వాహనతనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు లేని, నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్న వాహనాలే లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన మొత్తం 36 వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేసి, యజమానుల నుంచి రూ.7,510 జరిమానా విధించి వసూలు చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, వాహన యజమానులు అందరూ వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా స్పష్టంగా కనిపించే నెంబర్ ప్లేట్లు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నెంబర్ ప్లేట్లు వక్రీకరించడం, అంకెలు మార్చడం, స్పష్టంగా కనిపించకుండా చేయడంవంటి చర్యలకు పాల్పడవద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా వాహనాల యజమానులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంచుకోవడంతోపాటు, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. పట్టణంలో రోడ్డు భద్రత పటిష్టం చేయడానికి ఇటువంటి డ్రైవ్ లు నిరంతరం చేపడుతామని పోలీసులు స్పష్టం చేశారు.

