‘ఎస్ఐఆర్’పై రాజకీయ పార్టీలతో కలెక్టర్ల సమీక్షలు




✍️ దివిటీ మీడియా
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాల్సిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం పట్ల రాజకీయ పార్టీల సహకారం కోసం జిల్లా కలెక్టర్లు బుధవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిపై సమీక్ష జరిపి, రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, ఈ
జిల్లాలో మొత్తం 1,460 పోలింగ్ స్టేషన్లు, 12,43,781మంది ఓటర్లుండగా, ఇప్పటి వరకు 8,48,491మంది ఓటర్ల వివరాలు డిజిటలైజ్ చేశామని తెలిపారు. 68.22 శాతం పురోగతి ఉందని, ఇంకా 3,95,290 మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం అధికారులు 85 శాతం వరకు డిజిటలైజేషన్ పూర్తి చేసే అవకాశముందని,100 శాతం పూర్తి కావాలంటే ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. బీఎల్‌వోలు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లు పూర్తి వివరాలతో తిరిగి అందజేసేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎస్డీసీ సదానందం, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగ డీటీ అన్సారీ, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్నెం గోపాలరావు, వి.రాజేష్, బెల్లం వేణుగోపాల్, మంకెన రమేష్, కె.వెంకట్రావు, లింగనబోయిన సతీష్ బాబు, స్వర్ణ సుబ్బారావు, పాలడుగు టిఆర్ కృష్ణ ప్రసాద్, సిహెచ్. వెంకటేశ్వర్లు, నెల్లూరి వీరబాబు, వేల్పుల రామయ్య, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో….
—————————————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులు ‘ఎస్ఐఆర్’ విజయవంతం చేయడంలో రాజకీయ పార్టీల సహకారం కోరారు. జిల్లాలోని మొత్తం 9,96,198 మంది ఓటర్లలో 5,44,047(54.61 శాతం) మంది ఎన్యుమరేషన్ ఫారాలను డిజిటైజేషన్ కోసం సమర్పించినట్లుగా వెల్లడించారు. ఈ ప్రక్రియను అధికారులు గంటగంటకు పర్యవేక్షిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ , జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, నవీన్ రాజకీయ పార్టీల ప్రతినిధులు వై.శ్రీనివాసరెడ్డి, డి.ఆర్. వెంకటేష్ నాయక్, ఎ.రాంబాబు, కె. ప్రవీణ్ కుమార్, అన్వర్ షేక్, అన్నవరపు సత్యనారాయణ, వాసిరెడ్డి మురళి, జుజ్జూరు మోహన్ కృష్ణ పాల్గొన్నారు.

