Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleSpecial ArticlesTelangana

గాడి తప్పిన పాలన… అవుతోంది హేళన…

గాడి తప్పిన పాలన… అవుతోంది హేళన…

‘ఇసుక రవాణా’ పై తీరుమారని అధికారులు

✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 26)

ఇసుక అక్రమ రవాణా విషయంలో తీరు మార్చుకోని అధికారులు, ఇప్పటికీ అదే పంథాలో సాగుతుండటం తీవ్ర విమర్శల వెల్లువకు కారణమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇసుక విషయంలో కొనసాగుతున్న విమర్శలు, ఆరోపణలు, సెటైర్లు చూస్తుంటే అధికారులు ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నారో? ఎవరికీ అర్థం కావడం లేదు. ఇంతటి ఘోరమైన విమర్శలు వస్తున్నప్పటికీ ఎందుకు తమ విధులు, అధికారాలు వినియోగించడం లేదనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఓవైపు గోదావరినది, మరో వైపు కిన్నెరసాని నది ప్రవహిస్తున్న ఈ బూర్గంపాడు మండలం ఇసుక అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా, ఇటీవలి వరకు బాహాటంగానే ఇసుక అక్రమ రవాణా సాగుతున్నా తమకేమీ పట్టనట్లు చోద్యం చూశారు. అడపాదడపా తనిఖీల పేరుతో, అక్రమ రవాణా నిరోధం పేరుతో ఇసుక అక్రమ రవాణా చేసే దారుల్లో కందకాలు తవ్వి వదిలేసిన సందర్భాలున్నాయి. అయినా బూర్గంపాడు మండలంలో అధికారుల చిత్తశుద్ధికి ‘సవాల్ విసురుతూ’ ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. అధికారులు తవ్విన కందకాలు పూడ్చి వేసి మరీ అక్రమ రవాణా సాగించారు. అంతగా సవాల్ చేసినప్పటికీ ఇసుక అక్రమరవాణా చేస్తున్నవారిపై తీసుకున్న చ‌ర్య‌లు కంటితుడుపుగా కూడా లేక పోవడం విశేషం. సరే, ఇదంతా గతంలో జరిగిన వ్యవహారం కదా అనుకున్నా, నేటికీ అధికారుల తీరు మారే విధంగా ఏమీ కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యం, వ్యవహార శైలిపై వస్తున్న విమర్శల గురించి వార్తా కథనాలు రాస్తే, లోపాలు సరిచేసుకునే ప్రయత్నం కూడా చేయకుండా అక్కసు వెళ్లగక్కడం అలవాటుగా మారింది. ఓ వార్తాకథనం రాస్తే చాలు ‘తమకష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు’ అంటూ తెగ బాధపడే అధికారులకు ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు ‘కనుల విందు’ చేస్తున్నట్లున్నాయి. తమ విధుల్లో భాగంగా ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా తాము చేసే చిన్న చిన్న పనులు కూడా ఏదో ఘనకార్యాలు చేసినట్లుగా కొందరు రాస్తున్న అంశాలను చూసి పొంగిపోయే అధికారులు, తమపై వచ్చిన విమర్శలపై పరిశీలించుకుని తీరు సరిచేసుకోవాలనే ఆలోచన చేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ‘కూపన్లతో ఇసుకరవాణా’ కు అనుమతుల విషయంలో కూడా తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అనుమతుల చాటున ఎలాంటి అవసరం, అనుమతి లేని ట్రాక్టర్లను కూడా నిరోధించడం లేదనే విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో కనీసం ఇప్పటికైనా అధికారులు తమ పనితీరు మార్చుకుంటారో? లేదో? చూడాలి మరి..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఐటీడీఏ పీఓ

Divitimedia

వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

Divitimedia

కలెక్టర్ కార్యాలయంలో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు

Divitimedia

Leave a Comment