జిల్లా గ్రంధాలయం పరిశీలించిన కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 6)
కొత్తగూడెంలోని జిల్లా గ్రంథాలయాన్ని మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ పరిశీలించారు.ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, పుస్తకాలను పరిశీలించిన ఆయన విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, గ్రంథాలయంలో శాశ్వత సభ్యత్వం వివరాలు, పాఠకులకు ఇస్తున్న పుస్తకాల రిజిస్టర్, తదితరాల వివరాలను గ్రంథాలయ అధికారిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయం స్టోర్ రూమ్ తీరును, అందులోని పుస్తకాలు పరిశీలించారు. మరుగుదొడ్లు, ఫ్యాన్లు లైట్లు తదితర సౌకర్యాలపై ఆరా తీశారు. పుస్తకాలకు ఇన్వార్డ్ నెంబర్ ఇస్తున్నారో, లేదో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రంథాలయంలోని విలువైన, పురాతనమైన పుస్తకాలు సరైన పద్ధతిలో భద్రపరచాలని సూచించారు. అక్కడ పుస్తకాలు భద్రపరచడానికిగాను గోడలకు అలమరాలు ఏర్పాటు చేయాలని, పుస్తకాలను శుభ్రం చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్లను ఏర్పాటు చేయాలని కూడా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్తగూడెంలో తెలంగాణభవన్ పక్కన నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులు, ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో పుస్తకాలు చదివేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రంధాలయంలో ఉన్న పుస్తకాలను పోటీ పరీక్షల సమాచారం, గ్రంధాలు, నవలలు తదితరాలను విభజించి అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నూతన గ్రంథాలయంలో మిషన్ భగీరథ అధికారుల ద్వారా పైప్ లైన్ ఏర్పాటు చేసి, సంపు, ట్యాంకుల ద్వారా తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. దూరం నుంచి చదువుకోవడానికి గ్రంథాలయానికి వచ్చే విద్యార్థులకు మహిళా సంఘాల ద్వారా రూ.20కే అందుబాటులో భోజనం పెట్టే విధంగా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రంథాలయ వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో గ్రంథాలయాలకు వచ్చి, పురాతన గ్రంథాలు, పుస్తకాలు చదివి వాటి ప్రాముఖ్యత అందరికీ తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజనస్వామి, జిల్లా గ్రంథాలయఅధికారి ఎం.నవీన్ కుమార్, లైబ్రేరియన్ జి.మణిమృదుల, అధికారులు పాల్గొన్నారు.