Divitimedia
Bhadradri KothagudemEducationHealthKhammamLife StyleSpecial ArticlesTelanganaWomen

పర్యవేక్షణ ‘గాలిలో వెలగని దీపం…’

పర్యవేక్షణ ‘గాలిలో వెలగని దీపం…’

‘చమురు’ కోసం భారీగానే తప్పని వ్యయం

ఐసీడీఎస్ లో విచిత్రమైన ప్యవహారం…

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 23)

“గుడినే మింగే వాడికి లింగమొక లెక్కా…?” అనేది ఓ సామెత… అందులోనూ అడిగేవారు లోకువైతే ఇష్టం వచ్చినట్లు ఆడుకోవచ్చు కదా…? అందుకేనేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసీడీఎస్ లో ఓ సీడీపీఓ ”నా డ్యూటీ నా ఇష్టం” అంటూ చెలరేగిపోతున్నారు. తనను అడిగే దమ్మెవరికీ లేదనే అహంకారంతో ఆమె వ్యవహరిస్తున్న తీరు చూసి సహచర అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ప్రతిరోజూ విధులు నిర్వర్తించాల్సిన ఆమె నెలకోసారి తన ఆఫీసుకు వచ్చిపోతున్నారు. ఎందుకో ఏమోగానీ ఉన్నతాధికారులు కూడా కిక్కురమనకుండా కుక్కిన పేనుల్లాగా పడి ఉంటున్నారు. ఈ వ్యవహారమంతా చూస్తున్న మిగతా సీడీపీఓలు కూడా ‘ఆహా ఏమి ఆమె ధైర్యం’ అంటూ ఆదర్శంగా తీసుకునే ప్రయత్నాల్లో తల మునకలయ్యారు. ఆ సీడీపీఓ ‘సెట్’ చేసిన ఈ ‘ట్రెండ్’ అందరూ ఫాలో అయితే ఐసీడీఎస్ లో అధికారులు, ఉద్యోగులు, అంగన్వాడీ సిబ్బంది మొత్తం ఆనందంగా కాలం గడిపేయవచ్చు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ మారుమూల ఐసీడీఎస్ ప్రాజెక్టులో పర్యవేక్షణను గాలికొదిలేసిన అధికారుల తీరుపై “దివిటీ మీడియా” అందిస్తున్న ప్రత్యేక కథనం…

వివాదాలకు ఆలవాలమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసీడీఎస్ లో ఓ మారుమూల ప్రాజెక్టులో పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టిన సీడీపీఓ వ్యవహారం సర్వత్రా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 200కు పైగా అంగన్వాడీ కేంద్రాలున్న ఆ ప్రాజెక్టులో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు జోరుగా వస్తున్నాయి. ఆ ప్రాజెక్టు సీడీపీఓ ఖమ్మంలో నివాసం ఉంటూ, నెలకొకసారో, రెండుసార్లో వచ్చి పనులు చూసుకుని వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు మీటింగ్ ఉన్నప్పుడు, జీతం పనులున్నప్పుడు మాత్రమే ఆఫీసుకు వచ్చి వెళ్తూ, మిగిలిన రోజులలో ‘ఆన్ లైన్’ పర్యవేక్షణకు మాత్రమే పరిమితమైనట్లు చెప్తున్నారు. కుటుంబ బాధ్యతలను సాకుగా చూపి, ఉన్నతాధికారుల మెతక వైఖరితో ఆ సీడీపీఓ తనకు ప్రభుత్వం అప్పగించిన పర్యవేక్షణ గాలికి వదిలేసి, తీవ్ర నిర్లక్ష్యంతో విధులు విస్మరిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాల్లో స్థానిక ప్రముఖుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆమె ‘మేనేజ్’ చేసుకుంటున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు ఆమెపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఆ సీడీపీఓ వ్యవహారాన్ని సాకుగా చూపి జిల్లాలో మరికొందరు సీడీపీఓలు, ఏసీడీపీఓలు కూడా తమ పనితీరు మార్చుకుని, మేనేజ్ చేసుకునేలా తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ సీడీపీఓ వ్యవహారాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, సరైన చర్యలు తీసుకోనట్లయితే ఐసీడీఎస్ లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం పొంచి ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి.

Related posts

ఉల్వనూరు హెచ్ఎంపై మండిపడిన ఐటీడీఏ పీఓ

Divitimedia

రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోళ్లు చేయాలి

Divitimedia

ఎన్.హెచ్.ఎం బకాయిలు విడుదల చేయాలని కోరిన సీఎం రేవంత్

Divitimedia

Leave a Comment