అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై కలెక్టర్ జితేష్ వి పాటిల్
✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జూన్ 21)
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మతు పనులు త్వరగా పూర్తిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులపై ఆయన శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశమందిరంలో డీఆర్డీఓ విద్యా చందనతో కలిసి నీటిపారుదల, పంచాయతీరాజ్, అర్‌అండ్‌బీ, మున్సిపల్, పీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఈఈలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 697పాఠశాలల్లో పనులుచేసే విధానంపై ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో తాగునీరుగా మిషన్ భగీరథ నీటిని అందించకుండా, పాఠశాల ఆవరణలో గానీ,తరగతిలో గానీ స్టీల్ ట్యాంక్ ఏర్పాటుచేసి దానికి సెడ్మెంట్ ఫిల్టర్ బిగించవలసిందిగా ఆదేశించారు. దీనివల్ల విద్యార్థినీ విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు లభించి, వర్షాకాలంలో వచ్చే ఎటువంటి వ్యాధులనైనా నివారించవచ్చని తెలిపారు. పిల్లలు భోజన సమయంలో చేతులు కడుక్కోవడానికి, భోజన అనంతరం ప్లేట్స్ కడగడానికి స్టీల్ వాష్ బేసిన్ ఏర్పాటు చేయాలని, వాడిన నీరు ఇంకడానికి ఇంకుడుగుంత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రికల్ పనులకు సంబంధించి వైరింగ్, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు బిగించవలసిందిగా, వైరింగ్ మొత్తం కన్సీల్డ్ పద్ధతిలో చేయించవలసిందిగా కోరారు. టాయిలెట్లు విషయంలో గదిలో టైల్స్ వాడరాదని, కాంక్రీట్ ఫ్లోరింగ్ చేయించి రెడ్ ఆక్సైడ్ తో పెయింట్ వేయాలని దీనివల్ల ఖర్చు తక్కువవుతుందని పిల్లలు జారిపడే అవకాశం కూడా ఉండదని తెలిపారు. ఒకవేళ టాయిలెట్ పైకప్పు కారుతూ ఉంటే దానిని తొలగించి జీఐ షీట్ బిగించి, దానిపై జీఐ షీట్ పైన కెమికల్ ట్రీట్మెంట్ తో వర్షపునీరు కారకుండా నివారించవచ్చని తెలిపారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి పాఠశాలలో మునగ, చింత, కరివేపాకు, ఉసిరి, వెలక్కాయ వంటి ఎత్తైన చెట్లు నాటాలన్నారు. పిల్లల ఆహ్లాదం కోసం మల్లె,మందార, కనకాంబరం నందివర్ధనం, గులాబీ మొక్కలను పెంచాలన్నారు. ఆరోగ్య రీత్యా తులసి, ఇన్సులిన్ ప్లాంట్, రణపాల, నేల ఉసిరి, తిప్పతీగ మొక్కలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మొక్కల ఏర్పాటులో పాఠశాల ఉపాధ్యాయులు అందరూ పాల్గొనాలని, తద్వారా విద్యార్థులకు మంచి సందేశం అందుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరచారి, ఆర్ అండ్ బి డీఈ నాగేశ్వరరావు, మున్సిపల్ డీఈ రవికుమార్, ట్రైబల్ వెల్ఫేర్ డీఈ, మెప్మా పీడీ రాజేష్, సెర్ప్ డీపీఎం నాగజ్యోతి, రంగారావు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంఈఓలు, డీఈలు, ఏఈలు, ఐకేపీ ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.