ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అదనపు కలెక్టర్ సమీక్ష
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం (మే 17)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ ఆదేశించారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఐడీఓసీలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈనెల 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులకు ఏ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొత్తగూడెం జిల్లాలో 23 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షకేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు తాగునీరు అందుబాటులో వుంచాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆయన ఆదేశించారు. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5408 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 2,726 మంది విద్యార్థులు హాజరు కానున్నారని అదనపు కలెక్టర్ వెల్లడించారు. సమీక్షలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి సులోచనరాణి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి శిరీష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

