మహిళలు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలి : కలెక్టర్
దివిటీ మీడియా – కొత్తగూడెం, మార్చి 5
మహిళల అభివృద్ధికి విద్య ప్రధానమైనదని, విద్యావంతురాలైన మహిళ అన్నిరంగాల్లోనూ తన శక్తిసామర్థ్యాలు నిరూపించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల ఆకాంక్షించారు. మంగళవారం జిల్లా ఐడీఓసీ సమావేశమందిరంలో మహిళా,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళాదినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మహిళల అభ్యున్నతికోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, అందులోనూ సంక్షేమకార్యక్రమాలన్నీ మహిళల పేరు మీదే మంజూరు చేస్తోందన్నారు. పనిచేసే మహిళలు సమాజానికి ‘రోల్ మోడల్స్’ అంటూ జిల్లాకలెక్టర్ అభివర్ణించారు. డీఆర్డీఓ విద్యాచందన, మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత మాట్లాడుతూ, లింగ వివక్ష నిర్మూలన కుటుంబవ్యవస్థ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలన్నారు. పనిచేసే మహిళలపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉండాలన్నారు. ఎన్సీడీ ప్రాజెక్టు ద్వారా ‘భేటీ బచావో- భేటీ పడావో నినాదంతో బడి ఈడు బాలికలంతా తప్పనిసరిగా బడిలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు, ఉద్యోగాలలో కూడా మహిళలు తమదైనశైలిలో పనిచేసి అందరి మన్ననలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ జెండర్ ఈక్విటీ అధికారి అన్నామణి, సిడిపివోలు, మహిళా, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.