‘వచ్చేది ప్రజా ప్రభుత్వం… కేసీఆర్ అవినీతిని వెలికితీస్తాం…’
తెలంగాణ పర్యటనలో పదునెక్కిన రాహుల్ గాంధీ ప్రసంగాలు
✍🏽 పొలిటికల్ బ్యూరో – దివిటీ మీడియా
రానున్నది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అని, కుటుంబ పాలనతో కేసీఆర్ కాజేసిన అక్రమ సంపద మొత్తాన్ని వెలికితీస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఆయన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హైదరాబాదు పర్యటనలలో తీవ్ర స్థాయి విమర్శలతో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని సీఎం కేసీఆర్ అంటున్నారని, ఆయన చదువుకున్న స్కూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిందని,
కేసీఆర్ నడిచే దారి రోడ్డు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిందన్నారు. ఇకముందు ఇది దొరల తెలంగాణ కాదని, కుటుంబ పరిపాలన అంతకన్నా కాదని హెచ్చరించారు. మంత్రి వర్గంలో ఉన్న సంపన్న పదవులన్నీ కూడా కేసీఆర్ కుటుంబానివి మాత్రమేనని, మద్యం మైగింగ్స్ అన్నీ కూడా కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయన్నారు.
ఆయన ప్రజల కోసం తెలంగాణ తేలేదని, కేవలం కుటుంబ అభివృద్ధికోసం, కుటుంబ లాభాలకు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకున్నారని ఆరోపించారు. కాలేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు మోసం చేసి ప్రజల సొమ్ము తినేశారని, ఇదంతా తెలంగాణ ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
ఎన్ని లక్షల కోట్లు అయితే అభివృద్ధి పేరు చెప్పి తిన్నారో, వాటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ప్రతినెల మహిళలకు రూ.2500 బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, 1200 రూపాయలున్న గ్యాస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ.500 కు తీసుకొస్తుందని తెలిపారు. మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం అమలు పరుస్తామని, ప్రతినెల రైతుకు 15వేల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని, గృహ జ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటును ఫ్రీగా ఇప్పిస్తామన్నారు. కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారని అది కేవలం ఆయన ఆఫీసులకు, ఆయన కుటుంబ నివాసాలకు మాత్రమేనని, ప్రజలకు కాదని తెలిపారు. వృద్ధులకు నెలకు 4000రూపాయలు పెన్షన్ ఇస్తామని, కేసీఆర్ లాగా ఉత్తుత్తి మాటలు చెప్పే ప్రభుత్వం తమది కాదని, కాంగ్రెస్ చెప్తే చేస్తుందని స్పష్టం చేశారు. బీసీలకు కూడా ఇదే రిజర్వేషన్ అందజేస్తామని, 24 వేల కొత్త లోకల్ బాడీ పోస్టులు వస్తాయని రాహుల్ గాంధీ ప్రకటించారు. బీఆర్ఎస్ 20 లక్షల మంది రైతులను మోసం చేసిందని, ధరణి సర్వేలో కంప్యూటర్ల గురించి పేద రైతులకు తెలియకపోవడంతో వారి యొక్క భూములను లాక్కొని వారికి నచ్చిన వారికి, వారి అధికారపార్టీ కార్యకర్తలకు కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారు లాక్కున్న భూములను తిరిగి ఎవరి భూములు వాళ్లకు అప్పగిస్తామని కేసీఆర్ కి కూడా అర్థమయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ప్రకటించారు. మొదటి వాగ్దానంగా ప్రతి కుటుంబానికి ఉద్యోగం కల్పిస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అంటున్నారని, కేసీఆర్ మీకు తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ అప్పగించారని గుర్తు చేశారు. ఒక్క కుటుంబం కోసమే తెలంగాణ ఏర్పడలేదని, ప్రజలందరి కోసం ఏర్పడిందన్నారు. కేసీఆర్ నరేంద్రమోడీకి పార్లమెంటులో పూర్తి మద్దతు తెలిపారని, ఎంఐఎం, టిఆర్ఎస్ కూడా బీజేపీకి మద్దతునిచ్చాయని, వారంతా ఒక్కటేనని ఆరోపించారు. తమ మొదటి లక్ష్యం ప్రజల యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేయటమేనని ప్రకటించారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్, ను గద్దె దించుతామని, అక్కడ ఢిల్లీలో నరేంద్రమోడీని గద్దె దించుతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. తెలంగాణ పర్యటనలో విమర్శల దూకుడు పెంచిన రాహుల్ గాంధీ, బీఆర్ఎస్, కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు, ఆరోపణలకు పదును పెట్టారు. దూకుడుతో ప్రచారం సాగించి, ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రచార పర్యటనలో పలువురు కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొన్నారు.