Divitimedia
Bhadradri KothagudemDELHIHanamakondaHyderabadKhammamMahabubabadMuluguNational NewsPoliticsSpecial ArticlesTelangana

తెలంగాణలో నేడు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన

తెలంగాణలో నేడు రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన

సెమీఫైనల్ ఎన్నికల్లో విజయం కోసం చెమటోడ్చుతున్న అగ్రనేత

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్ లాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో చెమటోడ్చుతున్నారు. 2014లో దాదాపు మరో ఏడెనిమిది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఈసారి అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సానుకూలత పెంచుకునే దిశగా ప్రస్తుత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అవసరముంది. ఇంతటి కీలకమైన ‘నాకౌట్’ తరహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, దేశమంతటా కాంగ్రెస్ పార్టీకి మరింత సానుకూలత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్న తెలంగాణలో శ్రమిస్తే విజయం ఖాయమనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఉన్నారని తెలుస్తోంది. అందుకే తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధతో పదే పదే అవకాశం దొరికినప్పుడల్లా వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల తన సోదరి ప్రియాంక ప్రచారానికి రాలేకపోయిన తరుణంలో తెలంగాణలో పార్టీ కేడర్ ను నిరుత్సాహపర్చకుండా చూసుకునేందుకు
రాహుల్ గాంధీ అప్పటికప్పుడు షెడ్యూల్ మార్చుకుని వచ్చి మరీ ప్రచారం చేశారు. ఇలాంటి ఉదాహరణలు, పరిస్థితులు చూస్తే తెలంగాణలోఅందివచ్చిన సానుకూలతను ‘క్యాష్’ చేసుకునేందుకున్న అవకాశాల్లో దేనినీ వదలకుండా వినియోగించుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈసారి చావోరేవో తేల్చుకునే పరిస్థితుల్లో రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన సభ నిర్వహించిన ప్రతిచోటా కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనలుండేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహం అమలు చేస్తోంది. అందులోనూ తెలంగాణలో మొట్టమొదటి ప్రచారసభను ఖమ్మంలో నిర్వహించిన రాహుల్ గాంధీ, ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ప్రచార సభలు, రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం కేసీఆర్ ప్రచారం నిర్వహించిన పినపాక, నర్సంపేటలలో శుక్రవారం (నవంబరు 17) రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పినపాక లాంటి నియోజకవర్గంలో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ లేని విధంగా ‘అగ్రనేతల ప్రచారం’ సాగుతోందంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఏస్థాయిలో ప్రాధాన్యత పెరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లోనే రాహుల్ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు.
                   ———————
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేటి పర్యటన వివరాలు…
                   ———————
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత నేడు ఒకేరోజు ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం  నిర్వహించనున్నారు. కార్నర్ మీటింగులు,  రోడ్ షోలు, పాదయాత్రలతో ఆయన తన  ప్రచారాన్ని హెూరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చి, అక్కడి నుంచి హెలి కాప్టర్లో ఉదయం 11 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పినపాక నియోజకవర్గ కేంద్రం మణుగూరు చేరుకుంటారు. రెండు గంటలకు మణుగూరులో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పినపాక నుంచి నేరుగా నర్సంపేటకు చేరుకుంటారు. రాహుల్ గాంధీ మధ్యాహ్నం 2గంటల  నుంచి 3గంటల దాకా నర్సంపేటలో రోడ్ షో నిర్వహించిన తర్వాత రోడ్డుమార్గంలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడే సాయంత్రం 4గంటల నుంచి పాదయాత్ర చేయనున్న రాహుల్ గాంధీ, అక్కడి నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్ షో పూర్తిచేసుకుని, సాయంత్రం 6-30గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాదు రాజేంద్ర నగర్ చేరుకుంటారు. రాజేంద్రనగర్లో పార్టీ  సమావేశం తర్వాత ఢిల్లీకి తిరిగి వెళ్తారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతంలో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన ప్రచారంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. పినపాక, నర్సంపేట, వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో రాహుల్ గాంధీ ఎన్నికలప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఎన్నికలు పరిష్కరిస్తున్న వంతెన సమస్య

Divitimedia

అదానీతో జగన్ హయాంలో జరిగిన ఒప్పందం రద్దు చేయాలి

Divitimedia

పోలీసుల వద్ద లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

Divitimedia

Leave a Comment