విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో శాస్త్రీయ విద్యా సాధన
పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారావు
✍🏽 దివిటీ మీడియా – వరంగల్
విప్లవ విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో ఉచిత, నాణ్యమైన, శాస్త్రీయవిద్య సాధన కోసం విద్యార్థులంతా సంఘటితంగా పోరాడాలని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహరావు పిలుపునిచ్చారు. నవంబర్ 5 నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్న విప్లవ విద్యార్థి అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నర్సంపేట డివిజన్ కేంద్రంలో మేడపల్లిలోని దుస్సా చేరాలు స్తూపం వద్ద కార్యక్రమం నిర్వహించారు. పి.డి.ఎస్.యు జెండాలు ఆవిష్కరించి, విప్లవ విద్యార్థి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ , రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం విద్యారంగాభివృద్ధిని, విద్యార్థి ,యువతకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని ప్రధాని నరేంద్రమోడీ, ఇంటికొక ఉద్యోగం గానీ, నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని కల్పిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వాలు అధికార పీఠమెక్కగానే ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారన్నారు. పదేళ్ల పాలనలో తెలంగాణ విద్యారంగం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోక, తీవ్ర విధ్వంసానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఉచితవిద్య , వైద్యంతోపాటు చదివిన చదువులకు సరైన కొలువులు కల్పించాలని డిమాండ్ చేశారు. విప్లవ విద్యార్థి అమర వీరుల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు అలువాల నరేష్, జిల్లా నాయకులు వినయ్, రాజు, సిద్దు, డివిజన్ నాయకులు ఆనంద్, నవీన్, వెంకటేష్, తిరుపతి, హరిబాబు, ప్రశాంత్ ,వంశీ, అజ్ఞాన్, అభి, విజయ్, శ్రీధర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.