Divitimedia
Bhadradri KothagudemSpecial ArticlesTelanganaWomen

భద్రాద్రి కొత్తగూడెం ‘ఐసీడీఎస్’ లో ఆమే ‘డాన్’…

భద్రాద్రి కొత్తగూడెం ఐసీడీఎస్ లో ‘ఆమే డాన్’…

ఐదేళ్లుగా తిష్ట వేసుకుని… అధికారులనే హడలెత్తిస్తున్న సీడీపీఓ

సిబ్బందికి వేధింపులు… ఉన్నతాధికారులకూ బెదిరింపులు…

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా, శిశు సంక్షేమశాఖలో సరికొత్త ‘డాన్’ అవతారంలో ఓ సీడీపీఓ అందరినీ హడలెత్తిస్తున్నారు. జిల్లా ఐసీడీఎస్ విభాగంలో తాజా పరిణామాలు చూస్తే ఆమె తన ప్రాజెక్టు పరిధిలో సిబ్బంది మేదే కాకుండా ఉన్నతాధికారులపైన కూడా పెత్తనం చెలాయిస్తున్న తీరు తారాస్థాయికి చేరింది. ఆమె ప్రతాపానికి ఉన్నతాధికారులే భయంతో వణికిపోతున్నారంటే పరిస్థితులు ఎంత ఘోరంగా దిగజారాయనేది తేలికగానే అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల క్రితం పైరవీలతో ఈ జిల్లాకు డెప్యుటేషన్ మీద వచ్చిన ఆమె ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుని మరీ జిల్లా అధికారులనే భయపెట్టేస్థాయికి వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐసీడీఎస్ పని తీరును మెరుగుపర్చేందుకు జిల్లా కలెక్టర్లు చేస్తున్న ప్రయత్నాలకే విఘాతంగా మారిన ఈ దుస్థితిపై ‘దివిటీ మీడియా’ అందిస్తున్న ప్రత్యేక కథనం…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసీడీఎస్ విభాగంలో ఘోరంగా దిగజారిన పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల జిల్లా సంక్షేమాధికారిగా ఉన్న సబితను కమిషనరేట్ కు సరెండర్ చేశారు. అనారోగ్య కారణాలు, ఇతర పరిస్థితులలో ఆమె తన విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతుండటంతో జిల్లాలో పరిస్థితులు బాగా దిగజారుతున్నాయనే కారణాలతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆమె స్థానంలో కొత్తగూడెం సీడీపీఓ స్వర్ణలతలెనినాకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామాల్లో ఐసీడీఎస్ పనితీరు చక్క దిద్దేందుకు కలెక్టర్ చేపట్టిన చర్యలకుతోడు సరిదిద్దాల్సిన కొన్నిపరిస్థితులను వివరిస్తూ,
‘దివిటీమీడియా’లో కథనం ప్రచురితమైంది. ఆ కథనంలో ఆ సీడీపీఓ అవినీతి, అసమర్ధత గురించి కూడా వెల్లడించడంతో, ఇదంతా తనకు వ్యతిరేకంగా తమ ఉన్నతాధికారులే బయటకు తెస్తున్నారనే అనుమానంతో ఆ సీడీపీఓ ఏకంగా జిల్లా ఉన్నతాధికారులపైనే లేనిపోనివి సృష్టించి, మీడియాకు లీకులను అందిస్తున్నారు. సాక్షాత్తూ ఈ జిల్లా కలెక్టర్ వెళ్లిన ఓ ప్రైవేటు పనిమీదనే ఆరోపణలు చేస్తూ, కలెక్టరును తప్పుదారి పట్టించినట్లు మీడియాలో కథనాలు రావడంతో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆరోజు సెలవురోజు కావడంతో కలెక్టర్ వస్తున్నారనే కారణంతో అధికారులు చేసిన ఏర్పాట్లను తప్పపట్టేలా ఉన్న ఆ కథనంలో పేర్కొన్న విషయాలు ఆ సీడీపీఓకు తప్ప వేరెవరికీ తెలిసే అవకాశం లేని పరిస్థితి. జిల్లా సంక్షేమాధికారిగా తన సహచర సీడీపీఓ బాధ్యతలు చేపట్టడం నచ్చని ఆ సీడీపీఓ, ఉక్రోషంతో సాక్షాత్తూ కలెక్టర్ ప్రైవేటు పర్యటన గురించి తప్పడు సమాచారం మీడియాకు ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రోజురోజుకూ మరింత వివాదాస్పదంగా మారుతున్న ఆ సీడీపీఓ, తన ప్రాజెక్టుపరిధిలో అంగన్ వాడీ కేంద్రాల పనితీరును గాలికొదిలేసి బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. కిందిస్థాయి సిబ్బందిని వేధించి వారి వద్ద నుంచి ‘చిల్లర’ వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు చాలాకాలంగా వస్తున్నాయి. అయినప్పటికీ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులను ‘కాకాపట్టి’, తనకు గిట్టనివారిపై వారికి లేనిపోనివి నూరి పోసే చాకచక్యంతో ఆ సీడీపీఓ తననెవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తనకు నచ్చని వారిని ఆమె ఏవిధంగా వేధిస్తారనేందుకు ఇటీవల జరిగిన ఓ వ్యవహారమే పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. తన ప్రాజెక్టుపరిధిలో ఓ సర్కిల్ సూపర్ వైజర్ తన అక్రమాలకు సహకారం అందించడం లేదనే కారణంతో ఆమెపై కక్ష పెంచుకున్నారు. ఆ సర్కిల్ పరిధిలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా కాకుండా అడ్డుకున్నారు. మిగిలిన సర్కిల్స్ లో లేని సమస్య, తన సర్కిల్లో కావాలనే సృష్టిస్తున్నారని గుర్తించిన ఆ సూపర్ వైజర్, ఆ సమస్య పరిష్కరించమని పదే పదే కోరుతున్నప్పటికీ ఆ సీడీపీఓ ఏమాత్రం పట్టించుకోలేదు. జిల్లా, రాష్ట్ర అధికారులు ఎవరైనా వస్తే సమస్య తన మెడకు చుట్టు కుంటుందనే భయంతో ఆ సూపర్ వైజర్ విధిలేక ‘ఐసీడీఎస్ వాట్సాప్ గ్రూపులో’ తన సమస్య అందరికీ తెలిసేలా పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య అందరికీ తెలిసేలా పోస్ట్ చేయడం కూడా ఆ సీడీపీఓ కోపం పెరిగేందుకు మరో కారణంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులు కోకొల్లలు ఉన్నాయని ప్రాజెక్టు సిబ్బంది చెప్తున్నారు. ఆమె అవినీతి, అక్రమాల చిట్టా బయటకు తీసేందుకు వివరాలు కోరుతూ ‘సమాచార హక్కు చట్టం-2005’ ప్రకారం దరఖాస్తులు చేసినవారికి విసుగుపుట్టేలా చేయడం ఆమె ప్రత్యేకత. సమాచారం కోసం జిల్లాస్థాయిలో అప్పీలు చేసుకుంటే జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలక్కూడా ఆమె ఏమాత్రం విలువలేని పరిస్థితి కలిగిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ‘ఐసీడీఎస్ డాన్’ గురించి ఎంతగా చెప్పినా తక్కువే. ప్రస్తుతం ఆ ఐసీడీఎస్ డాన్ సీడీపీఓపై ఆమె బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ సీడీపీఓ వేధింపుల నుంచి తమను కాపాడే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించాలని, మహిళా, శిశు సంక్షేమశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా వెంటనే ఈ వ్యవహారంపై కఠినచర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదేళ్లుగా డెప్యుటేషన్ మీద తిష్ట వేసుకుని కూర్చుని ఆమె చేస్తున్న ఆగడాలు అరికట్టకపోతే ఈ జిల్లాలో ఐసీడీఎస్ పని తీరును చక్కదిద్దడం ఎవరివల్లా కాదనేది అక్షరసత్యం..

Related posts

వరంగల్- ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల

Divitimedia

శ్రీసత్యసాయి స్కూల్ విద్యార్థులకు ఐటీసీ రోటరీ ఇన్‌భద్రా వితరణ 

Divitimedia

బ్రిలియంట్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

Divitimedia

Leave a Comment