Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationLife StyleSpot NewsTelanganaWELFAREWomen

గ్రామీణ మహిళల రక్షణకు జెండర్ రిసోర్స్ సెంటర్లు కీలకం

గ్రామీణ మహిళల రక్షణకు జెండర్ రిసోర్స్ సెంటర్లు కీలకం

శిక్షణ కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన

**********************************

✍️ దివిటీ మీడియా

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు గృహ హింస, లింగ వివక్ష, లైంగిక వేధింపులు, సామాజిక, ఆర్థికపరమైన సమస్యలకు గురైనప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియక మౌనంగా భరించే పరిస్థితులను మార్చేందుకు జెండర్ రిసోర్స్ సెంటర్లు (జి.ఆర్.సి.) కీలకంగా ఉపయోగపడతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) విద్యాచందన తెలిపారు. జి.ఆర్.సి.ల పనితీరుపై అవగాహన కల్పించేందుకు గురువారం ఐడీఓసీ సమావేశమందిరంలో మండల సమాఖ్య పాలకవర్గ సభ్యులు, ఏపీఎంలు, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులకు సెర్ఫ్ జెండర్ అడ్వైజర్, ట్రైనర్ జమున ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో డీఆర్డీఓ విద్యాచందన మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి దశలో భద్రాచలం, మణుగూరు, సుజాతనగర్, లక్ష్మిదేవిపల్లి మండలాలకు జెండర్ రిసోర్స్ సెంటర్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సెంటర్ల ద్వారా మహిళలపై జరుగుతున్న హింసకు అడ్డుకట్ట వేయడంతోపాటు, కుటుంబ వేధింపులు, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. మహిళల హక్కులు, సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించడం, మానసిక ఒత్తిడికి గురైన బాధితులకు నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. గ్రామ, మండల సమాఖ్యల సభ్యులతో సామాజిక కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో ముగ్గురు, మండల స్థాయిలో ఐదుగురు చొప్పున సభ్యులతో ఈ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కమిటీ సభ్యులకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జెండర్ రిసోర్స్ సెంటర్ల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. జెండర్ రిసోర్స్ సెంటర్లలో ప్రతిరోజూ మహిళల సమస్యలు విని పరిష్కార మార్గాలు సూచిస్తారని, ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జీఆర్‌సీలలో కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కేంద్రాల వద్ద ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళలు లింగవివక్ష, లైంగిక వేధింపులతోపాటు సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్న సందర్భాల్లో ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సామాజిక కార్యాచరణ కమిటీ సభ్యులు మహిళల సమస్యలను సానుభూతితో విని అవసరమైన సూచనలు, సలహాలు అందించడంతోపాటు, అర్హులైన మహిళలకు ప్రభుత్వ పథకాలు అందేలా చురుకైన పాత్ర పోషిస్తారని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డీపీఓ బి.అనూష , జెండర్ ట్రైనర్ జమున, సెర్ఫ్ జెండర్ డీపీఎం లింగయ్య గౌడ్, డిస్ట్రిక్ట్ మిషన్ కో–ఆర్డినేటర్ రూప, మండల సమాఖ్య పాలకవర్గ సభ్యులు, సోషల్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఏపీఎంలు, డీఆర్డీఏ హెచ్.డి. విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పూసుగూడెం పంచాయతీకి రాష్ట్రస్థాయి అవార్డు

Divitimedia

కలెక్టర్ ను కలిసిన ‘టీజీఈడబ్ల్యుఐడీసీ’ ఈఈ

Divitimedia

హైదరాబాదుకు తరలి వెళ్లిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

Divitimedia

Leave a Comment