కోటి చీరల పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్


పంపిణీలో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశాలు

✍️ దివిటీ – హైదరాబాద్ (నవంబరు 19)
కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని సీఎం ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ పథకంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీర పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రివర్గ సహచరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్యల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. “ఏ ఒక్క మహిళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణలో ఆడపడుచులకు సారె, చీర ఇవ్వడం సంప్రదాయమని, ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారె అందించాలని ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ నిర్దేశించిన గడువులోగా, విడతల వారిగా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక అధికారికి ఈ కార్యక్రమ బాధ్యతలు అప్పగించాలని, ఈ చీరల పంపిణీ గురించి ముందుగానే ప్రజలందరికీ తెలిసేలా చెప్పాలని సీఎం సూచించారు. మహిళా సంఘాలు తమ ఉత్పత్తులను శిల్పారామంలో కేటాయించిన ఇందిరాశక్తి బజార్‌లో మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తేవాలని అమెజాన్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించుకునే అంశంపై ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.27 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణమే కాకుండా వాటికి యజమానులుగా చేశామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణను అప్పగించడం, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ ప్లాంట్లు అప్పగించడం వంటి పలు కార్యక్రమాల ద్వారా వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
మహిళా సంఘాలకు ఇప్పటివరకు డ్రెస్‌కోడ్ లేని కారణంగా సరైన గుర్తింపు లభించలేదని, వడ్డీలేని రుణాలు అందించడంలో గతంలో నిర్లక్ష్యం జరిగిందని, వాటిని సరిదిద్దుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతోందని సీఎం తెలిపారు. చీరల పంపిణీని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలన్నది ప్రభుత్వ విధానమన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబాల్లో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చీరల పంపిణీలో లోటుపాట్లు లేకుండా చూడాలని, కులగణన సందర్భంగా సేకరించిన వివరాల డేటాతో, ఫేషియల్ రికగ్నిషన్‌తో పాటు ఆధార్ నెంబర్ నమోదు చేసుకుని ఎక్కడా తప్పులు జరక్కుండా పారదర్శకంగా పంపిణీ కార్యక్రమం జరగాలని ఆదేశించారు.
చీరల విషయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదు. మున్సిపాలిటీలు, పట్టణాల్లో రెండో విడతలో చీరలు అందిస్తామని తెలిపారు. ఏ మహిళకూ చీర అందలేదన్న సమస్య ఉత్పన్నం కావద్దని, తూతూమంత్రంగా కార్యక్రమం నిర్వహించడానికి వీలులేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా తీసుకునేలా, అందరూ సమన్వయంతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మహిళా సమాఖ్య ప్రతినిధులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య మాట్లాడుతూ, ఈ చీరల తయారీ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు సిరిసిల్లకు వచ్చి పరిశీలించి బాగున్నాయని చెప్పారని తెలిపారు.
చీరల రంగు, డిజైన్ బాగున్నాయని ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి చెప్పారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులు ఎలా నడుస్తున్నాయని ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ముఖ్యమంత్రి వాకబు చేశారు.
సచివాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*****************************
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో…
********************************
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కలెక్టర్ జి.వి.పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, సెర్ప్ అదనపు డీఆర్డీఓ నీలేష్, డీపీఓ అనూరాధ, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్లు సుజాత, శ్రీకాంత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళాసంఘాల సభ్యులు ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు ఈ చీరల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ‘జల్ సంచయ్ – జన్ భాగీదారీ’ కార్యక్రమంలో జిల్లా జాతీయ అవార్డు సాధించిన సందర్భంగా మహిళాసంఘాల సభ్యులు జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనలను సత్కరించారు.

