భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జాతీయ అవార్డు
కేంద్ర మంత్రి నుంచి అందుకున్న కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (18 నవంబరు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జలసంరక్షణలో సాధించిన విశేష ఫలితాలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘జల్ సంచయ్–జన్ భాగీదారీ’ జాతీయ అవార్డును సాధించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ నుంచి ఈ అవార్డును జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్, డీఆర్డీఓ విద్యాచందన అందుకున్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో, వివిధ శాఖల సమన్వయంతో 29,103 జలసంరక్షణ పనులు పూర్తి చేయడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయస్థాయి మూడో జోన్‌లో, కేటగిరీ–3లో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. ఈ అవార్డు కింద కేంద్రప్రభుత్వం రూ.25లక్షల నగదు బహుమతి ప్రకటించింది. జిల్లాకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించిన సందర్భంగా కలెక్టర్ జి.వి.పాటిల్, డీఆర్డీఓ విద్యాచందన, జిల్లాలో నిర్వహించిన జల సంరక్షణ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం, గ్రామస్థాయి సంస్థల చురుకుదనం, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం కారణంగానే ఈ అవార్డు సాధ్యమైందని పేర్కొన్నారు. జిల్లాలో చేపట్టిన జలసంరక్షణ పనులు భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వ్యవసాయ నీటి భద్రతను గణనీయంగా మెరుగుపరిచాయని పేర్కొన్నారు. జిల్లా సమిష్టి కృషికి ప్రతీకగా ఈ విజయాన్ని అభివర్ణించారు.

