Divitimedia
Bhadradri KothagudemEntertainmentHealthLife StyleSpecial ArticlesTelanganaTravel And TourismWomenYouth

పండుగ పూట పారిశుద్ధ్యలోపం…

పండుగ పూట పారిశుద్ధ్యలోపం…

పర్యవేక్షణ కరవైన గ్రామ పంచాయతీలు

✍️ దివిటీ మీడియా – సెప్టెంబరు 22

‘ఈ చెత్త కుప్ప చూశారా…?, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని గొమ్మూరు రేవులో గోదావరి తీరంలో పరిస్థితి ఇది…’. తెలంగాణలో వైభవంగా, ఉత్సాహంగా జరుపుకునే ‘బతుకమ్మ పండుగ’లో భాగంగా ఇక్కడ నిమజ్జనోత్సవాలు చేస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలోనే ఇంత చెత్త తెచ్చి పడేసారంటే పల్లెల్లో ఎంతటి దుస్థితి ఉందనేది అర్థం చేసుకోవచ్చు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేక ముస్తాబు చేయాల్సిన ఈ ప్రదేశంలోనే నాగినేనిప్రోలురెడ్డిపాలెం గ్రామ పంచాయతీ అధికారులే ఇలా చెత్త తెచ్చి పడేసారంటే గ్రామపంచాయతీల్లో పాలన తీరెలా ఉందనేది అర్థంచేసుకోవచ్చు.

తెలంగాణ పల్లెల్లో చాలా ప్రత్యేకమైన బతుకమ్మ పండుగకు ‘పారిశుద్ధ్యలోపం’ స్వాగతం పలుకుతోంది. పేరుకుపోతున్న చెత్తకుప్పలతో ప్రజలు పండుగ వైభవం ఆస్వాదించలేకపోతున్నారు. పల్లెలకు కళ తెచ్చే ‘బతుకమ్మ సంబురాలకు’ ఓ వైపు ముస్తాబవుతుంటే, మరోవైపు సరైన పర్యవేక్షణ లేక పంచాయతీల్లో పాలన కుంటుపడుతోంది. బూర్గంపాడు మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా, ఎక్కువ పంచాయతీల్లో చెత్త, బురదగుంతలు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పండుగ చేసుకునేందుకు గ్రామీణులు, అందులోనూ ముఖ్యంగా మహిళలు ఇబ్బందిపడుతున్నారు. ఈ మండలంలోని మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో ఓ వీధిలో చెత్త సేకరణ ప్రక్రియలో దాదాపు నెలరోజుల ‘గ్యాప్’ తీసుకున్నారంటే పల్లెల్లో దుస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో ప్రతి వీధిలోనూ బతుకమ్మ పందిళ్లు ఏర్పాటుచేసి, నవ రాత్రులు వేడుకగా జరుపుకునే ప్రజలకు ఇప్పుడున్న పారిశుద్ధ్య దుస్థితి ఇబ్బంది కరంగా మారుతోంది. ఉన్నతాధికారులు తక్షణం దృష్టిసారించి పల్లెల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపర్చేలా, పర్యవేక్షణ సక్రమంగా సాగేలా చర్యలు చేపట్టాలని మహిళలు కోరుతున్నారు. ఈ దుస్థితిపై బూర్గంపాడు ఎంపీడీఓ జమలారెడ్డిని సంప్రదించేందుకు ‘దివిటీ మీడియా’ ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

Related posts

పడితే ప్రాణాలు పోవడం ఖాయం…

Divitimedia

కొండరెడ్లకు ఓటుహక్కు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు

Divitimedia

కలెక్టరేట్ లో మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యమా…?

Divitimedia

Leave a Comment