భారీవర్షాల నేపధ్యంలో కలెక్టర్లతో మాట్లాడిన మంత్రి తుమ్మల
గోదావరి, మున్నేరు వరదలతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
✍️ దివిటీ (ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం) ఆగస్టు 29
భద్రాచలం వద్ద గోదావరినది, ఖమ్మంలో మున్నేరువాగు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాలలో గల లోతట్టు గ్రామాల ప్రజలను అలర్ట్ చేయాలని, రైతులు, పశువుల కాపరులు వాగులు, వంకలు దాటకుండా కట్టడి చేయాలని, అందుకోసం పోలీస్ సిబ్బంది సేవలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ను తుమ్మల ఆదేశించారు. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల పరివాహకప్రాంతాల్లో లోతట్టు గ్రామాల్లో వరద ఇబ్బందులు లేకుండా చూడాలని, వరదలతో పూర్తిగా నిండిన చెరువుల కట్టలు తెగే ప్రమాదమున్నందున నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బంది చెరువుల వద్ద పర్యవేక్షణగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఎగువ నుంచి గోదావరికి భారీగా వరద ఉధృతి ఉన్నందున భద్రాచలం వద్ద కరకట్ట స్లూయిస్ లీక్ కాకుండా, పట్టణంలో వర్షపునీరు కరకట్ట వద్ద నిలువకుండా ఎత్తిపోసే మోటార్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అత్యవసర వైద్యసేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఖమ్మం వద్ద మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జిల్లావ్యాప్తంగా వరదల్లో సహాయ చర్యలకు జిల్లా యంత్రాంగం సన్నద్దంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ను మంత్రి ఆదేశించారు. కొణిజర్ల మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహించే మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపి వేయాలని, కట్టెలేరు ఉప్పొంగి పలుచోట్ల రహదారులపై వరదనీరు పోటెత్తడంతో ఆ రహదారుల్లో ప్రయాణాలు నిలిపి వేయాలన్నారు. జిల్లాలో పాలేరు, మున్నేరు, వైరా, కట్టెలేరు ఉపనదులతో పాటు వాగులు పొంగి ప్రవహిస్తున్నందు వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. వాగులు, చెరువులు, నదుల్లో చేపల వేటకు వెళ్లే వారిని కట్టడి చేయాలని, రైతులు పశువుల కాపరులను వాగులు వంకలు దాటకుండా కట్టడిచేయాలని, వరదలతో పూర్తిగా నిండిన చెరువుల వద్ద కట్టలు తెగకుండా నీటిపారుదలశాఖాధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ కు మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.