గణేష్ మండపాల్లో నియమనిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
మండపాల ఏర్పాటు కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 18)
జిల్లాలో గణేష్ మండపాల నిర్వహణకు ఉత్సవ కమిటీ సభ్యులు తెలంగాణ పోలీసుశాఖ రూపొందించిన పోర్టల్ లింక్ : https://policeportal.tspolice.gov.in లో ధరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ కేవలం మండపాల నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కోసం మాత్రమేనని ఆయన వివరించారు. ఈ సమాచారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. పోలీసు శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని, ఆ తర్వాతే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీలు పాటించవలసిన నియమ నిబంధనలను ఎస్పీ వివరించారు…
👉 గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే.
👉 ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
👉 నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి.
👉 గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ నకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.
👉 మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం యజమాని, సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.
👉 మండపాల కమిటీ వివరాలు, బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి.
👉 సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.
👉 మండపాల్లో, శోభాయాత్ర సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలను ఏర్పాటు చేయరాదు.
👉 మండపం వద్ద 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
👉 భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతోపాటు వాలంటీర్లను నియమించుకోవాలి.
👉 అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దగ్గరలో ఇసుక, నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.
👉 గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు, పాటలు పూర్తిగా నిషేధం.
👉 మండపం వద్ద పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి. విధిగా పోలీసు అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో రాసి సంతకం చేస్తారు.
👉 అనుమానాస్పదమైన బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు, వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే డయల్ 100 గానీ స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలి.
👉 సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి వదంతులను నమ్మకూడదని, ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులను గానీ Dial 100 నంబర్‌ను గానీ సంప్రదించాలని ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ సూచించారు.

===≈======
గణేష్ ఉత్సవ కమిటీల సభ్యులతో సీఐ సమావేశం
===≈======
బూర్గంపాడు పోలీసుస్టేషన్ లో సోమవారం పాల్వంచ ఇన్ఛార్జ్ సీఐ (అశ్వారావుపేట) నాగరాజు మండల గణేష్ మండపాల కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రాబోయే గణపతి నవరాత్రుల సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తగు సూచనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఎస్.హెచ్.ఒ ఎస్సై మేడ ప్రసాద్, ఎస్సై దేవ్ సింగ్ పాల్గొన్నారు.

